Payment of Old Bills Before Election: ఎన్నికల వేళ సొంత పార్టీకి చెందిన పాలకవర్గాలను బుజ్జగించేందుకు జగన్ సర్కార్ కొత్త ఎత్తుగడ వేసింది. ఆర్థిక సంఘం నిధులతో గత మూడేళ్లలో చేసిన పనులకు కొన్ని బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 530 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఎన్నికల కోడ్ వెలువడే ముందు పట్టణ, స్థానిక సంస్థలకు విడుదల చేసింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థతో సంబంధం లేకుండా పెండింగ్ బిల్లులను పుర, కమిషనర్లే చెల్లించేలా ఆదేశాలిచ్చింది.
అయితే ఆర్థిక సంఘం నిధులతో పనులు చేసి సీఎఫ్ఎంఎస్(CFMS) పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన బిల్లులను ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం పుర కమిషనర్లు రద్దు చేయాలి. అదే పనుల కోసం పాలకవర్గాలతో మరోసారి తీర్మానం చేయించి బిల్లులు చెల్లించనున్నారు. అంటే పాత పనులే మరోసారి కొత్తగా చూపించి బిల్లులు చెల్లిస్తారు. 15వ ఆర్థిక సంఘం నిధులను పట్టణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈనెల 5న పట్టణ స్థానిక సంస్థలకు మెమో జారీ చేశారు. 2020-21, 2021-22 సంవత్సరానికి కేంద్రం ఇచ్చిన నిధుల సంగతి ఏమిటన్న ప్రశ్నలు పట్టణ స్థానిక సంస్థల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల కోడ్ కూసినా నిప్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు మాత్రం ఇప్పటికీ అధికార పార్టీతో అంటకాగుతున్నారు. ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే అధికార పార్టీ అనుయాయులకు బిల్లులు చెల్లిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే 2,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగిపోయాయి. పారదర్శకత ఆస్కారమే లేకుండా మార్చి 16 నుంచి 26 లోపు చెల్లింపులు జరిగాయి. ఆర్థికశాఖలో అధికార పార్టీకి ఎప్పటి నుంచో అండదండలు అందిస్తున్న కార్యదర్శి కె.వి.వి. సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిశ్శబ్దంగా పూర్తి చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి మార్చి 16న రాసిన లేఖ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 18న జీవో 607 విడుదల చేసింది.
ఆ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ప్రతిపాదన, ప్రతి సిఫార్సును ఈ కమిటీ పరిశీలన తర్వాత ఎన్నికల సంఘానికి సమర్పించాలి. రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా స్క్రీనింగ్ కమిటీ పరిశీలన, చర్చ ముఖ్యం. కానీ కీలకమైన ఆర్థిక బిల్లుల చెల్లింపులో ఎలాంటి పరిశీలన, పారదర్శకత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అధికార పార్టీకి అనుచిత లబ్ధి కలిగించేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆరున్నరేళ్ల తర్వాత మళ్లీ - జగన్ బస్సుయాత్రపై ప్రజల ఆగ్రహం - CM Jagan Bus Yatra