Jagan Government Failed to Attract Investments: రాష్ట్రంలో అపారమైన సహజ వనరులున్నాయి. పారిశ్రామిక, పర్యాటక, ఆక్వా తదితర రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నాయి. కానీ విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో మాత్రం రాష్ట్రం వెనకబడింది. ఏ చిన్న అవకాశం ఉన్నా పెట్టుబడులు పెడతామంటూ పోటీలు పడే పారిశ్రామిక వేత్తలు మన దగ్గరకు ఎందుకు రావడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు మన దగ్గర ఈ దౌర్భాగ్యానికి కారణం సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్. ఆయన నేతృత్వంలోని వైసీపీ సర్కారు అవలంబిస్తున్న అస్తవ్యస్త విధానాలు, మౌలిక సదుపాయాల విస్మరణ, కమీషన్ల కక్కుర్తి ఫలితంగా ఉన్న పరిశ్రమలే పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.
కనీసం గ్రీన్‌ఫీల్డ్ రాజధాని అమరావతిపై ఈ ప్రభుత్వం దృష్టిసారించినా మనకూ ఒక మహానగరం సాకారమయ్యేది. అదీ చేయకపోవడంతో, అపార అవకాశాలున్న మనరాష్ట్రాన్ని కాదని పెట్టుబడులన్నీ తరలిపోయాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరవయ్యాయి. ఫలితంగా ఉన్నత చదువులతో పాటు కొలువులకూ యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఒకప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు టాప్-10 జాబితాలో స్థానం కోల్పోయింది. ఈ విషయంలో ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బంగాల్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు సైతం ముందు వరసలో ఉన్నాయి. తెలంగాణ కూడా మెరుగైన స్థానంలోనే ఉంది.
'వైసీపీ పాలనంతా అప్పులమయమే - అప్పు చేస్తే గానీ ప్రభుత్వం నడవని పరిస్థితి'
13వ స్థానంలో ఆంధ్రప్రదేశ్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు 65 వేల 502 కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన మహారాష్ట్ర జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. దిల్లీ 25వేల 582 కోట్లు, కర్ణాటక 23వేల 460 కోట్లు, గుజరాత్ 18వేల 884 కోట్ల విదేశీ పెట్టుబడులతో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అయిదారు స్థానాల్లో తమిళనాడు 11వేల 115 కోట్లు, తెలంగాణ 9వేల 679 కోట్లతో ఉన్నాయి. కేవలం 630 కోట్ల విదేశీ పెట్టుబడులను సంపాదించిన ఆంధ్రప్రదేశ్ మాత్రం 11వ స్థానంలో నిలిచింది.
2019 అక్టోబరు నుంచి 2023 సెప్టెంబరు నెలాఖరు వరకు ఎఫ్‌డీఐ గణాంకాలను పరిశీలిస్తే మనం ఎంత వెనకబడ్డామో స్పష్టమవుతుంది. మహారాష్ట్ర 4లక్షల 72వేల 829 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులను సాధించి ఈ జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. రెండో స్థానంలో కర్ణాటక 3లక్షల 58 వేల 517 కోట్లు, తృతీయ స్థానంలో గుజరాత్ 2లక్షల 57వేల 908 కోట్లతో ఉన్నాయి. 45వేల 445 కోట్ల పెట్టుబడులతో తెలంగాణ 7వ స్థానంలో ఉంటే 6వేల 679 కోట్లతో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది.
ఐటీని చావుదెబ్బ కొట్టిన జగన్ సర్కార్- పెట్టుబడుల ఆకర్షణలో అట్టడుగున రాష్ట్రం
రాజధానే లేకుండా చేసిన ప్రభుత్వం: పారిశ్రామికవేత్తలను ఆకర్షించి పెట్టుబడులను తీసుకురావాలంటే ఏ రాష్ట్రానికైనా రాజధాని నగరం ఎంతో ముఖ్యం. మన పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో పెట్టుబడులు తరలివచ్చేందుకు ఇవే కారణం. ఇటీవల కాలంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలు, నిర్మాణ రంగం, రసాయనాల తయారీ పరిశ్రమలు ఉన్నాయి.
ఈ రంగాలపై దృష్టి సారించిన రాష్ట్రాలకు విదేశాల నుంచి పెట్టుబడులు సమకూరుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక పారిశ్రామిక విధానాలను రూపొందించడం, సంస్థలకు ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటించటం, అన్నింటికీ మించి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటం ఆయా రాష్ట్రాలకు కలిసొస్తుంది. ఈ అంశాలపై మన ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో పాటు అసలు రాజధానే లేకుండా చేసింది. దాంతో పారిశ్రామికవేత్తలు ఎక్కడికి వెళ్లాలో ఎవరిని కలవాలో తెలియని పరిస్థితిని సీఎం జగన్ కలిపించారు.
జగన్ వైఫల్యం రాష్ట్రానికి శాపం - విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో వైఫల్యం: పట్టాభి
పరిశ్రమలను తరిమికొడుతున్న వైసీపీ నేతలు: గత అయిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక్క పారిశ్రామికవాడనూ అభివృద్ధి చేయలేదు. ఏ ఒక్క రంగాన్నీ తీర్చిదిద్దే ప్రయత్నం చేయలేదు. విశాఖలో ఐటీ, విజయవాడలో ఆటోమొబైల్, తిరుపతిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పరిశ్రమలు వస్తే రానీ లేకపోతే లేదన్నట్లుగా ప్రజాప్రతినిధుల వైఖరి ఉండటం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. పైగా తమ మాట వినని, ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులను గురిచేసి, వారి వ్యాపారాలను తరిమికొట్టేలా చేశారు. అందుకు అమరరాజా సంస్థే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కేవలం గనులు, ఇసుక వంటి సహజ సంపదను కొల్లగొట్టే సంస్థలకు మాత్రమే రెడ్ కార్పెట్ పరిచి ఇతర రంగాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.