Jagan Fraud Gudivada Tidco House Beneficiaries: గుడివాడలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు జగన్ కుచ్చుటోపీ పెట్టారు. తాము అధికారం చేపడితే టిడ్కో ఇళ్ల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారం చేపట్టారు. షరా మామూలుగా మడమ తిప్పారు. తీరా ఎన్నికల వేళ మరోసారి లబ్ధిదారులను మభ్యపెట్టేందుకు వైఎస్సార్సీపీ నేతలు యత్నిస్తున్నారు. మరోవైపు ఐదేళ్ల పాలనలో కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించలేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
అరకొర వసతులతో టిడ్కో ఇళ్లు పంపిణీ - సమస్యలు, అనారోగ్యం ఇక్కట్లతో ప్రజలు - Tidco Houses
Tidco Houses in TDP Governament: గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా గుడివాడ మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో 220 బ్లాకులుగా టిడ్కో ఇళ్లను నిర్మించారు. జీ ప్లస్ త్రీ నమూనాలో 300, 365, 430 చదరపు అడుగుల్లో మూడు కేటగిరీల్లో గృహాలు నిర్మించారు. 365 చదరపు అడుగుల గృహానికి 7.55 లక్షలు, 430 చదరపు అడుగుల గృహానికి 8.5 లక్షల చొప్పున లబ్ధిదారులు బ్యాంకులకు రుణం చెల్లించాల్సి ఉంది.
టిడ్కో ఇళ్ల రుణ మాఫీపై మాట మార్చిన జగన్: టిడ్కో ఇళ్లపై ఆర్థికభారం మోపుతున్నారని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి, టిడ్కో ఇళ్లు ఇస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత టిడ్కో రుణ విముక్తులను చేస్తామని అవసరమైతే వన్ టైం సెటిల్మెంట్ చేస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టి ఐదేళ్లు పూర్తయ్యి మళ్లీ ఎన్నికలు కూడా వస్తున్నా నేటి వరకూ వన్ టైమ్ సెటిల్‌మెంట్ ఊసెత్తలేదని టిడ్కో లబ్ధిదారులు వాపోతున్నారు.
టిడ్కో లబ్ధిదారులపై రుణ భారం - బ్యాంకుల నోటీసులతో ఆందోళన
"ఇళ్లు ఇచ్చారు. రుణమాఫి చేస్తానన్నారు కాని చేయలేదు. కూలీ పనులు చేసుకునే మాకు నెలకు 5వేలు కట్టడం ఇబ్బంది అవుతోంది. కొన్ని రోజుల క్రితం బ్యాంకు సిబ్బంది వచ్చి రుణాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రుణ మాఫీ చేసి ఆదుకోవాలి". -టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు
సమస్యలు పట్టించుకోకుండా రంగులకే పరిమితం: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తిచేసిన టిడ్కో ఇళ్లను రాజకీయ లబ్ధి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం రంగులేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇళ్ల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇళ్ల వద్దకు నీటి సరఫరా లేదని, పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టిడ్కో ఇళ్లలో మంచినీళ్లొద్దా? బిందెలతో మహిళల నిరసన
"5 నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నాము. పారిశుద్ధ్య కార్మికులు రావటం లేదు. నీళ్ల పైపులు పగిలిపోయాయి. ప్లంబర్‌ను పిలిస్తే నాసిరకం పైప్‌లైన్ ఉపయోగించారని తెలిపారు. టిడ్కో ఇళ్లలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. -లబ్ధిదారులు