Hyderabad Regional Ring Road Alignment : హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ORR)కు 40 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణం చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (RRR)ను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించారు. ఉత్తర భాగం సుమారు 158 కిలోమీటర్లు కాగా, దక్షిణ భాగం 182 కిలోమీటర్లు నిర్మించనున్నారు. సుమారు రూ.17వేల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఆరు వరసల మార్గం నిర్మిస్తున్నారు. ముందుగా ఫోర్ వే నిర్మాణం ఆ తర్వాత మరో రెండు వరుసల్లో రోడ్డు నిర్మించనున్నారు. ఈ రహదారిపై గంటకు 15 వేల వాహనాల రాకపోకలకు అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా.
హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు 158 కిలో మీటర్ల పరిధి కలిగిన ఉత్తర భాగంలో భూ సేకరణకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆయా గ్రామాల రైతులతో రెవెన్యూ అధికారులు వరుసగా సమావేశమై పరిహారం నిర్ణయం కోసం సంప్రదింపులు చేస్తున్నారు. మార్కెట్ విలువ ఆధారితంగా పరిహారం ఇస్తామని అధికారులు చెప్తుండగా రైతులు అంగీకరించడం లేదు. కాగా, త్వరగా భూసేకరణ చేపడితే నిర్మాణం పనులకు ఆటంకం ఉండదని భావిస్తున్న యంత్రాంగం వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే సర్వే పూర్తి చేసి భూ సేకరణకు సన్నాహాలు చేస్తున్నారు.
జాతీయ రహదారులతో అనుసంధానం..
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి దాదాపు 4500 ఎకరాల వరకు సేకరించనున్నట్లు ప్రాథమిక అంచనా. ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జగదేవపూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్ మీదుగా సంగారెడ్డి వయా కంది వరకు 110 కిలోమీటర్ల మేర విస్తరిస్తారు. రీజనలో రింగ్ రోడ్డు భువనగిరి వద్ద 163 నంబర్ హైవే, తూప్రాన్ వద్ద 44వ నంబర్ హైవే, సంగారెడ్డి వద్ద 161వ నంబర్ హైవేలతో అనుసంధానం అవుతుంది.
సాగు భూములు మరోసారి..
ఆర్ఆర్ఆర్ పరిధిలో వస్తున్న భూములు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌తోపాటు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రింగురోడ్డు, రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నవే కాగా, తాజాగా మరోసారి భూసేకరణ చేస్తుండటంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి నిర్వాసితులు కానున్నామని, అలైన్‌మెంటు మార్చాలని లేదా భూమికి భూమి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎకరం గరిష్ఠంగా రూ.3 కోట్లు, కనిష్ఠంగా రూ.50 లక్షలు పలుకుతోంది. పరిహారం ఎటూ సరిపోకపోవటంతో తమ బతుకులు ఆగమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాంతీయ రింగ్‌రోడ్డు మార్గ నిర్ణయానికి త్వరలో క్షేత్రస్థాయి సర్వే