Irregularities on Ambati Murali Apartment Construction in Guntur : గుంటూరులో వైఎస్సార్సీపీ నేత అంబటి మురళికి చెందిన భజరంగ్ ఇన్‌ఫ్రా నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ని నగర పాలక సంస్థ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికే ఒకసారి నిర్మాణాలు పరిశీలించి వెళ్లారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా కమిషనర్ పులి శ్రీనివాసులు రంగంలోకి దిగారు. అనుమతి పొందిన ప్లాన్‌కి, జరుగుతున్న నిర్మాణాలకు ఏవైనా తేడాలు ఉన్నాయా అని పరిశీలించారు. భవనానికి సంబంధించిన సెట్ బ్యాక్స్ వదిలారా లేదా అని కొలతలు తీశారు. వివిధ రకాల ఎన్ఓసీలను పరిశీలించారు
సరైన అనుమతులు లేవన్న ఆరోపణలు : గుంటూరులోని పట్టాభిపురం ప్రధాన రహదారి పక్కన అనుమతుల్లేకుండానే గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు. ఖరీదైన ప్రాంతంలో 5.80 ఎకరాల్లో జీ+14 అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ అపార్ట్‌మెంట్‌ను నిర్మించినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ అపార్ట్మెంట్లో 510 ఫ్లాట్లు ఉండగా, ప్రాజెక్టు విలువ రూ.500 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
పలుమార్లు అపార్ట్‌మెంట్ నిర్మాణం ప్లాన్ మార్పు : ఈ అపార్టుమెంట్‌కు సంబంధించి ఆరోపణలపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పందించారు. మీడియాలో వచ్చిన వార్తలతో పట్టణ ప్రణాళిక విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా తాను క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించినట్లు వెల్లడించారు. 2015లో 5 అంతస్తులతో నిర్మాణం మొదలుపెట్టారని పేర్కొన్నారు. అప్పట్లో రైల్వే శాఖ కూడా ఎన్‌వోసీ (NOC - No Objection Certificate) ఇచ్చిందని తెలియజేశారు. పలుమార్లు అపార్ట్‌మెంట్ నిర్మాణం ప్లాన్ మార్చారని తెలిపారు. ప్లాన్ మార్పునకు అనుగుణంగా అనుమతులు, ఎన్‌వోసీలు తీసుకోవాలని పేర్కొన్నారు. యాజమాన్యం మారినప్పుడు తీసుకోవాల్సిన పత్రాలు తీసుకోలేదని తెలియజేశారు. అన్ని అంశాలు పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
టౌన్ ఫ్లానింగ్ అధికారులు ఇప్పటికే అపార్ట్‌మెంట్ భవనాన్ని పరిశీలించి రిపోర్ట్‌ను సిద్ధం చేశారు. వారి రిపోర్డ్ ఆధారంగానే ఇవాళ ఈ నిర్మాణాన్ని పరిశీలించాను. 2015లో ఈ భవనం 5 అంతస్తులతో మొదలైంది. క్రమంగా ఈ భవనంలో అనేక మార్పులు వచ్చాయి. అందుకు అనుగుణంగా అనుమతులు తీసుకోలేదు. ఈ అంశాలను పరిశీలించిన అనంతరం ఈ భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారో లేదో నిర్థారిస్తాం-పులి శ్రీనివాసులు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్