Penna ahobilam Lakshmi Narasimha Swamy: ఉరవకొండలో వైఎస్సార్సీపీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి, ఆయన కుమారుడు దేవుడి రథం పేరుతో అక్రమాలకు తెరలేపారు. పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి ఆలయ సొమ్ము పై కన్నేశారు. స్వామివారి కొత్త రథం తయారీకి అయ్యే ఖర్చును రెండింతలు పెంచేసి సగం కాజేసేందుకు రంగం సిద్ధం చేశారు. అధికారులతో కుమ్మక్కై తమ అనుచరుడుకి టెండర్ ఇప్పించారు. ఇందుకోసం దేవాదాయ శాఖలోని ఓ అధికారి సదరు మాజీ ప్రజాప్రతినిధికి సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు పెన్నహోబిళం ఆలయంలోని ప్రతి పనిని తన అనుచరుడికే దక్కేలా చేసి స్వామి వారి సొమ్మును జేబులో వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్న దేవాదాయ శాఖ జిల్లా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గౌతంరెడ్డితో టెండరు: పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి రథం గతేడాది ఉత్సవాలకు కొన్ని రోజుల ముందు ధ్వంసమైన విషయం తెలిసిందే. అప్పటికప్పుడు తాత్కాలిక రథం తయారు చేయించి ఉత్సవాలు నిర్వహించారు. కొత్త రథం తయారీ కోసం భక్తుల నుంచి రూ. కోటి విరాళాలు సేకరించారు. మ్యాచింగ్ గ్రాంటు కింద దేవాదాయ శాఖ నుంచి రూ.1.30 కోట్లు మంజూరు చేశారు. ఇక్కడే ఉరవకొండ వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఆయన కొడుకు కుట్రకు తెరలేపారు. ఓ అధికారి తో కుమ్మక్కై కొత్త రథం తయారీకి అయ్యే ఖర్చును రెండింతలు పెంచేశారు. రూ.1.30 కోట్లతో పూర్తి చేయాల్సిన పనిని రూ. 2.30 కోట్ల అంచనాలు రూపొందించారు. గౌతంరెడ్డి అనే అనుచరుడితో టెండరు వేయించారు. అధికారులు సింగిల్ టెండర్ కే అమోదం తెలపడం గమనార్హం. అంటే రథం తయారీ పేరుతో రూ. కోటి కొట్టేసేలా ప్రణాళికలు వేశారని స్పష్టమవుతోంది.
రూ. 1.38 కోట్ల నుంచి 2.30 కోట్లకు అంచనాలు పెంచి: టెండర్లు దక్కించుకున్న గౌతంరెడ్డి కొత్త రథం తయారీ కోసం ఉరవకొండ, రేణుమాకులపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం రూ.1.38 కోట్లు విడతలవారీగా సొమ్ము చెల్లించేలా ఫిబ్రవరి 29న అగ్రిమెంటు రాసుకున్నారు. టెండరు వేయడానికి చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఉరవకొండకు చెందిన వ్యక్తులే చెల్లించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అంటే గౌతంరెడ్డిని ముందు పెట్టి మాజీ ప్రజాప్రతినిధి, ఆయన కుమారుడు వ్యవహారం నడిపించినట్లు అర్థమవుతోంది. రూ. 1.38 కోట్లకు తయారు చేయాల్సిన చోట రూ. 2.30 కోట్లకు అంచనాలు పెంచి మిగిలిన సొమ్మును తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్దమయ్యారు. భక్తుల నుంచి విరాళాల రూపంలో సేకరించిన రూ. కోటి ఆలయ ఖాతాలోనే ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చిన రూ. 1.30 కోట్లను రథం తయారీదారులకు చెల్లించి ఆలయ ఖాతాలోని రూ. కోటిని నొక్కేసేందుకు ప్రణాళికలు రచించినట్లుగా తెలుస్తోంది. రథం తయారీ విషయంపై పెన్నహోబిళం ఆలయ ఈఓ కె.విజయ్ కుమార్ ను వివరణ కోరగా కొత్త రథం నిర్మాణానికి రూ. 1.78 కోట్లతో టెండరు అప్పగించినట్లు తెలిపారు. రూ. 2.30 కోట్లు కేవలం అంచనా వ్యయం మాత్రమేనని వివరించారు.
ఆంజనేయస్వామి రథోత్సవంలో అపశృతి - ఒక్కసారిగా కూలిన రథం
అన్ని పనులు గౌతంరెడ్డికే: పెన్నహోబిళం ఆలయంలో ఏ పని చేయాలన్నా టెండర్లన్నీ గౌతంరెడ్డికే కట్టబెడుతున్నారు. ఆలయంలో సీసీ కెమెరాల నిర్వహణ గాలికొదిలేశారు. ఆలయంలో గౌతంరెడ్డి అనధికారికంగా అన్నీతానై వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రజాప్రతినిధి అనుచరుడు కావడంతోనే ఆయన పెత్తనంపై అధికారులెవరూ నోరు మెదపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
శ్రీశైలం మల్లన్నకు బంగారు రథం - కానుక సమర్పించిన ఎంపీ వేమిరెడ్డి