Guntur Underground Drainage DPR : గుంటూరు నగరానికి 2015లో యూజీడీ పథకం మంజూరైంది. డీపీఆర్ తయారు చేయాలని పనులు పర్యవేక్షించే రాష్ట్ర పురపాలక, ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అయితే డీపీఆర్ బాధ్యత తామే తీసుకుంటామని నగరపాలక సంస్థ చెప్పింది. డీపీఆర్ రూపొందించి కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలిచి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం మార్గదర్శకాలకు అనుగుణంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
గరిష్ఠంగా 2 కోట్లకు మించి ఛార్జీలు చెల్లించకూడదనే నిబంధనలను తుంగలో తొక్కిన పురపాలక సంస్థ హైదరాబాద్‌కు చెందిన ఎన్సీపీఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు టెండర్లు పిలవకుండానే కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కమీషన్ల కోసం 7 కోట్ల 59 లక్షలు చెల్లించారు. ఇది గుంటూరు మిషన్ కాదని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిబంధనలు వర్తించవని చెప్పి కౌన్సిల్ తీర్మానంతో చెల్లింపులు చేశారు. ఈ నేపథ్యంలో కన్సెల్టెన్సీ కంపెనీ నుంచి భారీగా కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరికి ఎంపీ గల్లా జయదేవ్ లేఖ
కన్సల్టెన్సీ కంపెనీకి అధిక మొత్తంలో చెల్లించి నరగపాలక అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాస్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని 2016లో ఫిర్యాదు చేశారు. కన్సల్టెన్సీ కంపెనీకి అధిక మొత్తంలో చెల్లించి నగరపాలక అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని దీనిపై విచారణ జరపాలని హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాస్ విజిలెన్స్ కు 2016లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎంపీ గల్లా జయదేవ్ కూడా నాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు, ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
విజిలెన్స్ అధికారులు 2023, సెప్టెంబరు 13న ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ నెల 2న నగరపాలికకు రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుల నుంచి ఉత్తర్వులు అందాయి. పరిమితికి మించి అదనంగా రూ.1.69 కోట్లు చెల్లించి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ నిగ్గు తేల్చింది. ఆ మొత్తాన్ని బాధ్యులైన అధికారుల నుంచి రాబట్టాలని సూచించింది. విజిలెన్స్ నివేదిక ప్రకారం అప్పుడు కమిషనర్లుగా పనిచేసిన ఐఏఎస్ అధికారిణి ఎస్.నాగలక్ష్మి, గ్రూప్-1 అధికారి కె.సుధాకర్, ఎస్‌ఈలు పి.ఆదిశేషు, ఆర్.గోపాలకృష్ణరెడ్డి, డీఈలు జీవీ, ఆర్‌ఎస్ ఈ వ్యవహారానికి బాధ్యులుగా పేర్కొన్నారు. సుధాకర్, ఆదిశేషు రిటైర్ కాగా గోపాలకృష్ణారెడ్డి, జి.వెంకటేశ్వరరావు, ఆర్.శ్రీనివాసరావు విధుల్లో ఉన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారి పింఛను నుంచి, విధుల్లో ఉన్న వారి జీతాల నుంచి సొమ్ము రికవరీ చేయాలని ఆదేశించింది.
ఈ తరహా అదనపు చెల్లింపులు నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన ఐదేళ్లలో అనేక పనుల్లో జరిగాయి. 2015లో జరిగిన దానికి క్రమశిక్షణ చర్యలతో పాటు రికవరీకి ఆదేశాలు వెలువడటంతో తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న అప్పటి కమిషనర్ నాగలక్ష్మి ఇప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్‌గా రాబోతున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన బదిలీల్లో గుంటూరు కలెక్టర్‌గా ఆదేశాలు వచ్చాయి. ఛార్జ్ తీసుకోవటానికి ముందే ఈ నివేదిక వచ్చింది. ఇప్పుడు రాబోయే కలెక్టర్ నుంచి కూడా సొమ్ము రికవరీ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.
UnderGround Drainage Works: ఏపీలో పడకేసిన పారిశుద్ధ్యం.. యూజీడీకి మంగళం పాడేసిన వైసీపీ సర్కార్..