Investment Fraud in Hyderabad : హైదరాబాద్ యూసుఫ్గూడాకు చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగిని ఫోన్ నంబర్‌ను గత డిసెంబరు 30న గుర్తు తెలియని వ్యక్తులు బిగ్ విన్నర్ అనే వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. అమీర్‌ఖాన్ అనే వ్యక్తి పేరిట ఉన్న గ్రూపులో నిత్యం స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసేవారు. షేర్లకు సంబంధించిన సమాచారాన్ని అందించేవారు. షేర్లకు సంబంధించిన సందేహాలు ఉంటే నివృత్తి చేసేవారు.
10 రోజుల తర్వాత అమీర్ ఖాన్ సహాయకురాలినంటూ ఆదెల్ అనే మహిళ నుంచి బాధితురాలికి వాట్సాప్ కాల్ వచ్చింది. తాము గోల్డింగ్ అనే కంపెనీని ప్రారంభించబోతున్నామని, జీబీఎల్ గోల్డ్ ట్రేడ్ పేరిట ఉన్న యాప్‌లో చేరాలంటూ లింక్ పంపింది. తక్కువ వ్యవధిలోనే భారీగా లాభాలు వస్తాయంటూ చెప్పడంతో బాధితురాలు ఆ లింక్ ఓపెన్ చేసి గ్రూప్‌లో చేరారు. తొలుత రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాలని అదెల్ అడిగితే బాధితురాలు నిరాకరించారు.
ఆదెల్ పలుమార్లు ఫోన్ చేయగా జనవరి 30న రూ.2లక్షలు పెట్టుబడిగా పెట్టారు. ముందుగా లాభాలు బాగానే ఉన్నట్లు కనిపించడంతో ఫిబ్రవరి 2న మరో రూ.3 లక్షలు, ఫిబ్రవరి 7న మరో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేశఆరు . ప్రతిరోజు అమీర్‌ఖాన్ సూచన మేరకు బాధితురాలు గోల్డింగ్ షేర్ల క్రయవిక్రయాలు చేశారు. కొన్ని రోజులకే రూ.5.5 లక్షల లాభమొచ్చినట్లు యాప్‌లో కనిపించింది.
Woman Loses 10lakhs In Investment Fraud in Hyderabad : పెట్టుబడితో పాటు లాభం కలిపి రూ.15.5 లక్షలు ఉన్నట్లు యాప్‌లో చూపడంతో ఫిబ్రవరి 22న బాధితురాలు రూ.4 లక్షలను విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించారు. తర్వాత యాప్‌లో చూసేసరికి రూ.11.5 లక్షలు ఉన్నట్లు చూపించినా బాధితురాలి ఖాతాలో మాత్రం రూ.4 లక్షలు జమ కాలేదు. మరుసటిరోజు రూ.1.5 లక్షలు విత్ డ్రా చేసినా ఫలితం కనిపించలేదు.
'మీ పార్శిల్లో అక్రమ ప్రొడక్ట్స్ ఉన్నాయి - పోలీసులకు చెప్పొద్దంటే నేనడిగిన డబ్బు ఇవ్వాల్సిందే'
ఇదే విషయమై ఆదెల్, అమీర్‌ఖాన్‌ను ప్రశ్నించగా బాధితురాలిని గ్రూప్ నుంచి తొలగించారు. ఫోన్లో పలుమార్లు మాట్లాడేందుకు ప్రయత్నించడంతో స్పందన రాకపోగా ఆమె నంబర్లను బ్లాక్ చేశారు. యాప్‌లో ఉన్న మెయిల్ అడ్రస్‌కు ఈ-మెయిల్ చేసినా ఫలితం లేకుండా పోయింది. డబ్బులు పోవడంతో మనోవ్యధకు గురైన బాధితురాలు గుండెనొప్పితో మరుసటిరోజే ఆసుపత్రిలో చేరింది. ప్రాథమికంగా చికిత్స అనంతరం గుండెపోటని నిర్ధారించిన వైద్యులు బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు.
60 ఏళ్లకు పైబడిన వయసు కావడంతో బాధితురాలు మరో ప్రముఖ ఆసుపత్రికి వెళ్లి అక్కడ వైద్యుల్ని సంప్రదించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని గుర్తించిన వైద్యులు మార్చి 1వ తేదీన గుండెకు శస్త్ర చికిత్స చేశారు. మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. చికిత్స ఖర్చులు రూ.7.7 లక్షలు అయినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో చెల్లించేందుకు ఆమె వద్ద డబ్బు లేకపోవడంతో బంధువులు, సన్నిహితులను బతిమాలి ఆసుపత్రి బిల్లులను చెల్లించి ఇంటికి చేరారు. కోలుకున్న అనంతరం ఈనెల 19న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రాథమికంగా బాధితురాలి డబ్బు చండీగఢ్, భోపాల్ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు.
పెట్టుబడుల పేరిట 70 ఏళ్ల వృద్ధుడి నుంచి 22 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు