Investigation Speeded up Madanapalle Sub Collector Office Case : అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనం చేసిన ఘటనలో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. మూడు రోజుల నుంచి పోలీసులు, సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కుట్రధారులుగా అనుమానిస్తున్న పలువురు రెవెన్యూ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మదనపల్లిలో గతంలో ఆర్డీవోగా పనిచేసిన మురళి, బదిలీ అయిన హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌లను పోలీసులు వరుసగా మూడో రోజు విచారిస్తున్నారు.
మదనపల్లె అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు - విచారణలో విస్తుపోయే నిజాలు - Madanapalle Fire Accident
మదనపల్లెకు చేరుకున్న అగ్నిమాపక శాఖ డైరెక్టర్ : ఈరోజు ఉదయం అగ్నిమాపక శాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగితే ఎవరు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చినప్పుడు కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారని దానిపై ఆరా తీశారు. కాగా ఈ ఘటనకు ప్రాథమిక విచారణలో బాధ్యులుగా తెలిన ముగ్గురు పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు.
పలువురు అధికారులపై వేటు : మదనపల్లి వన్ టౌన్ సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. మదనపల్లిలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిసిన తెల్లవారే వరకూ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలతో సీఐను వీఆర్‌కు పంపారు. ఆయనతోపాటు నైట్ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్లు హరిప్రసాద్, భాస్కర్ ను కూడా సస్పెండ్ చేశారు. ఈ ఘననపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఘటనలో కుట్ర కోణాన్ని వెలికితీయడానికి అధికార బృందం చర్యలు చేపట్టింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవి రెడ్డి ఈ ఘటనలో కీలక పాత్రధారిగా భావిస్తూ ఆయన కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
ఇదీ జరిగింది..
కాగా, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ‘22ఏ’ సెక్షన్‌లో మంటలు భారీగా వ్యాపించాయి. దాదాపు కార్యాలయంలో ఉన్న 25 విభాగాల్లోని ఫైళ్లు దగ్ధమయ్యాయి. అయితే అగ్నిప్రమాదానికి కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణం తొలత భావించినప్పటికీ అది కాదని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హెలికాఫ్టర్‌లో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సోమవారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. చివరకు ఇది ప్రమాదం కాదని ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనగా తేల్చిచెప్పారు.
అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం, అత్యంత కీలకమైన నిషేధిత భూముల జాబితా సెక్షన్‌లోనే మంటలు వ్యాపించడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫైళ్ల దగ్ధంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగిందో చెప్పాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై ఒక్కరోజులోనే మూడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. స్వయంగా కలెక్టర్‌తో మాట్లాడి అగ్నిప్రమాదంపై ఆరా తీశారు.
మదనపల్లె ఘటనపై ఏపీ సీఎం సీరియస్- తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని డీజీపీ, సీఐడీ చీఫ్‌కు ఆదేశాలు