International Women's Day Celebration : మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు (Former Vice President Muppavarapu Venkaiah Naidu) అన్నారు. నెల్లూరు జిల్లా వెంటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు (Swarna Bharat Trust) ఆధ్వర్యంలోమేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ అధ్యక్షతన గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకయ్య నాయుడు ప్రసంగించారు. కుటుంబం, సమాజంలో మహిళల పాత్ర కీలకమని అన్నారు. మహిళా సాధికారత లేకుంటే దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లలేదని తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ విషయంలో గణనీయమైన పురోగతి సాధించినా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం సాధించాల్సిన సవాళ్లు చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం స్వాతంత్య్రం వచ్చే నాటికి తొమ్మిది శాతం ఉన్న మహిళా సాధికారత ప్రస్తుతం 77 శాతానికి చేరిందని వెంకయ్య నాయుడు వివరించారు. సమాజంలో స్త్రీ పురుషులకు సమాన హక్కులు అవకాశాలు ఇవ్వాలని, మహిళా సాధికారిత ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. పురాణాల నుంచి మహిళకు గౌరవం ఉండేదని అన్నారు. లింగవివక్ష లేని సమాజం కావాలని కోరారు. లింగ వివక్ష మన మనసుల్లోకి రాని రోజున సమాజంలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన పలువురి మహిళలకు పురస్కారాలు అందజేశారు.
'అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని.. 'శ్రామిక మహిళా పోరాట' దినంగా జరుపుకోవాలి'
ప్రముఖులకు సన్మానం : రక్షణ, పరిశోధన తదితర రంగాల్లో పేరొందిన పలువురు మహిళలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆచార్య విజయ ఖాదర్(శాస్త్రవేత్త), రాజారత్నం అనూరాధ(ఐపీఎస్), ఘంటశాల పార్వతి రవి(చెన్నై కళాప్రదర్శిని మేనేజింగ్ ట్రస్టీ), లత(జనరల్ మేనేజరు, ఆర్వో, సతీష్ థావన్ స్పేష్ సెంటర్, షార్), బీకే నివేదిత(అసోసియేట్ డైరెక్టర్, హెచ్‌ఆర్‌పీఎం, ఇస్రో), ఉషా పీ వర్మ (అసోసియేట్ డైరెక్టర్, డీఆర్డీవో), శిరీషా(ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీవో)లు హాజరై మాట్లాడారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ట్రస్టు తరపున వీరిని వెంకయ్యనాయుడు, దీపా వెంకట్ సన్మానించి, అభినందన పురస్కారాలు అందజేశారు. వారు అందించిన సేవలను కొనియాడుతూ వెంకయ్యనాయుడు అభినందించారు. ఘంటసాల పార్వతి రవితో పాటు, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో నెల్లూరు నారాయణ వైద్య కళాశాల, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విలువైన వైద్యాన్ని గ్రామీణులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, వైద్యులు పాల్గొన్నారు.
విశాఖలో మహిళా దినోత్సవ అవార్డులు... షణ్ముఖప్రియకు జాతీయ పురస్కారం