Friendship Day 2024 : 'స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం' అన్నాడో కవి. నిజమే కదా మరి ఈ సృష్టిలో శాశ్వతంగా నిలిచిపోయే బంధమంటే అది స్నేహమే. ఆస్తిపాస్తులతో సంబంధం పనిలేకుండా, లింగభేదం చూసుకోకుండా, నిస్వార్థంతో వ్యవహరించే అనురాగ బంధం ఇది. మనతో రక్త సంబంధం లేదు, బంధువు కాదు. ఇంట్లో వ్యక్తి కాదు అవసరం వస్తే మాత్రం వెంటనే గుర్తొస్తాడు. ఏంటో చెప్పు నేనున్నానంటూ భుజంపై చేయి వేస్తాడు. అసలు సంబంధమే లేని వ్యక్తి అయినా జీవితంలో ప్రతి చోట నీతోనే ఉంటాడు అతనే ఒక ఫ్రెండ్. స్నేహం ఎక్కడ మొదలవుతుందో తెలియదు. ఎందుకూ అనే ప్రశ్నే రాదు. కష్టమొస్తే కన్నీరు తుడుస్తాడు. సంతోషమొస్తే పంచుకుంటాడు. అమ్మా, నాన్న, అక్కా, చెల్లి, తమ్ముడు ఇలా అన్ని బంధాలను దేవుడే ఇచ్చినా స్నేహితుడిని మాత్రం నువ్వే ఎంచుకోమని పంపిస్తాడు.
ఇంతటి మధురమైన అనుబంధం కాబట్టే దీనికంటూ ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. ఆ రోజున స్నేహితులంతా ఒక్కచోట చేరి ఆనందంగా గడుపుతారు. మరుసటి ఏడాది వరకూ గుర్తుండిపోయే మరెన్నో మధుర జ్ఞాపకాలను మూటగట్టుకుంటారు. మరి ఇంతటి నేపథ్యం ఉన్న స్నేహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకోవడానికి స్నేహితుల దినోత్సవానికి మించిన సందర్భం మరొకటి ఏముంటుంది చెప్పండి.
Friends Day Celebrations at Vijayawada Nalanda College : మరి అలాంటి స్నేహం అనేది విద్యార్థి దశ నుంచే మొదలవుతుంది. ఇంట్లో తల్లిదండ్రులకూ చెప్పుకోలేని విషయాలను స్నేహితులతోనే పంచుకుంటామని చెబుతున్నారు విజయవాడ నలంద కళాశాల విద్యార్థినులు. స్నేహితుల దినోత్సవాన్ని కళాశాలలో సందడిగా జరుపుకున్నారు. ఫ్రెండ్ షిప్ బ్యాండ్లు కట్టుకుని, ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. శ్రీకృష్ణుడు, కుచేలుడు స్నేహనికి మారుపేరుగా గుర్తు చేసుకున్నారు.
"తల్లిదండ్రులతో పంచుకోలేని విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. బాధలు, సంతోషాలు వారితోనే పంచుకుంటాం. ఏదైనా కష్టమొస్తే సపోర్ట్‌గా ఉంటారు. అందుకే మా కళాశాలలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటాం. జీవితంలో మంచి స్నేహితుడు దొరకడం కష్టమని, అలాంటి వారిని చేజార్చుకోకుండా ఉండటమే స్నేహితులకిచ్చే నిజమైన విలువ." - విద్యార్థినులు
"విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొదించేందుకు కృషిచేస్తున్నాం. స్నేహితుల దినోత్సవం సందర్భంగా అనాథ శరణాలయానికి బ్యాగులు, పుస్తకాలు అందజేస్తాం. విద్యార్థులు వారితో మమేకమై భరోసా కల్పిస్తారు. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది." - అనురాధ, ప్రిన్సిపల్, నలంద డిగ్రీ కళాశాల
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు మేరకు పుష్పగుచ్ఛాల సంస్కృతి విడనాడి అభినందనల సమయంలో పండ్లు, కూరగాయలు, మొక్కలు ఇచ్చే కొత్త సంస్కృతికి ఫ్రెండ్ షిప్ డేను పురస్కరించుకుని ఆహ్వానం పలికారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినుల్లో సామాజిక బాధ్యత పెంపొందించేలా కళాశాలలో కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు. జీవితంలో మంచి స్నేహితుడు దొరకడం కష్టమని, అలాంటి వారిని చేజార్చుకోకుండా ఉండటమే స్నేహితులకిచ్చే నిజమైన విలువ అని విద్యార్థినులు తెలిపారు.
International Friendship Day 2023 : ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ ఉండాలి.. మరి మీకు ఉన్నాడా..?