Inferior Ingredients in Srivari Prasadam : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూసినట్టు సమాచారం. నెయ్యి కల్తీ మాత్రమే కాదని స్వామివారి ప్రసాదాల్లో జీడి పప్పు, యాలకులు, కిస్‌మిస్ వంటివన్నీ నాసిరకమే వాడేవారని, చాలా వస్తువుల కొనుగోళ్లలో గోల్‌మాల్ జరిగిందని వెల్లడైనట్టు తెలిసింది. అస్మదీయ గుత్తేదారుల నుంచి వాటిని ఎక్కువ ధరలకు కొనేవారని తేలింది.
వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక : నిబంధనల ప్రకారం ఎనిమిది మి.మీ. పరిమాణం ఉన్న యాలకులు సరఫరా చేయాల్సి ఉండగా, గుత్తేదారులు నాలుగు మి.మీ. ఉన్నవి కలిపేసి ఇచ్చినా అప్పటి టీటీడీ పాలకమండలి, కొనుగోళ్ల కమిటీ పట్టించుకోలేదని విజిలెన్స్ విభాగం గుర్తించింది. గుత్తేదారులు బస్తాల్లో కిందంతా నాసిరకం సరకు నింపేసి, పైపైన నాణ్యమైన సరకులు పెట్టి పంపేవారని సమాచారం. నాణ్యమైన సరకు నుంచే నమూనాలు తీసుకుని తిరుమలలో ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించి, అంతా బాగున్నట్టు ధ్రువీకరించేవారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ విభాగం వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
పురుగులు పట్టిన నాసిరకం జీడిపప్పు! : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి టీటీడీకి వివిధ సరకులు సరఫరా చేస్తున్న గుత్తేదారుల్లో పాలకమండలి పెద్దలకు గిట్టనివారిని వేధించి బయటకు పంపేసినట్టు దర్యాప్తులో తేలింది. అత్యవసరం పేరుతో వారికి కావలసిన వారికి ఎక్కువ ధరలు చెల్లించి సరకులు కొన్నట్లు గుర్తించింది. సింగిల్‌బిడ్ దాఖలై, వేసినవారు బయటివాళ్లయితే టెండర్ రద్దు చేసేవారని, అదే కావలసిన వాళ్లు సింగిల్ బిడ్ దాఖలు చేసినా వారికి కాంట్రాక్ట్ కట్టబెట్టేవారని విజిలెన్స్ దర్యాప్తులో తేలిందని సమాచారం. జీడిపప్పు కొనుగోళ్లలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, పురుగులు పట్టిన నాసిరకం జీడిపప్పును గుత్తేదారులు సరఫరా చేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది.
బాగున్న నెయ్యి శాంపిళ్లనే పరీక్ష : తిరుమల కొండపై ఉన్నది వాటర్ సేఫ్టీల్యాబ్ మాత్రమే. అక్కడ నెయ్యి నాణ్యతను నిర్ధారించే పరీక్షలకు కావల్సిన పరికరాలు, నిపుణులైన సిబ్బంది లేరు. నెయ్యి ట్యాంకర్లలో 3 అరలు ఉంటాయి. నాణ్యతను పరీక్షించేందుకు 3 అరల నుంచి వంద గ్రాముల చొప్పున సేకరించి, ఆ మొత్తాన్ని కలిపి, దానిలోంచి నమూనాను తీసుకోవాలి. 3 అరల్లో ఒక దాంట్లోనే నాణ్యమైన నెయ్యి సరఫరా చేసి, మిగతా 2 అరల్లో కల్తీ నెయ్యితో నింపేవారా? బాగున్న నెయ్యి శాంపిళ్లనే పరీక్షకు తీసుకునేవారా అన్న కోణంలోనూ విజిలెన్స్ దర్యాప్తు సాగినట్టు తెలిసింది.
శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం : శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) పేరుతో ఆలయాల పునరుద్ధరణ/జీర్ణోద్ధరణకు నాటి టీటీడీ పాలకులు ఇష్టానుసారం నిధులు విడుదల చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ నాయకులకు ఇష్టానుసారం నిధుల పందేరం చేశారని గుర్తించారు. ఎన్నికలకు ముందు ఎక్కువగా వర్క్‌ఆర్డర్లు ఇచ్చినట్టు తేలిందని సమాచారం. ఇతర ఆలయాలకు గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు ఇచ్చేందుకే నిబంధనలు అనుమతిస్తుండగా, 63 ఆలయాలకు రూ.35 లక్షల వరకు కేటాయించినట్టు తెలిసింది. కొన్ని నిర్మాణం పూర్తి అయిన ఆలయాలకూ నిధులు విడుదల చేసినట్టు గుర్తించారని తెలిసింది.
టీటీడీ ఉన్నతాధికారులకు తెలిసే జరిగాయి : తిరుమలలో నిర్దిష్ట గడువు ముగిసిన పదమూడు ప్రైవేటు వసతి గృహాల్ని తీసేసి కొత్తవి కట్టేందుకు కాటేజ్ డొనేషన్ స్కీం కింద పలువురికి కేటాయించారు. ఎన్నికలకు ముందు మరో 4 అతిథి గృహాలు కేటాయించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. వాటిలో కొన్ని కాటేజీల్ని గతంలో వాటికి కేటాయించిన స్థలానికి మించి, మరికొంత ఆక్రమించి కట్టేసినా పాలకమండలి కళ్లుమూసుకుంది. గతంలో ఒక అతిథి గృహం 299 చ.మీ. విస్తీర్ణంలో ఉంటే, ప్రస్తుతం మరో 100 చ.మీ. మేరకు ఆక్రమించి కట్టేశారని విజిలెన్స్ నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. ఇవన్నీ టీటీడీ ఉన్నతాధికారులకు తెలిసే జరిగాయని, కానీ వారు చూసీచూడనట్టు వ్యవహరించారని నిగ్గుతేల్చింది.
గోవిందరాజస్వామి సత్రాల్ని కూల్చేశారు : తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాల్ని భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) ఛైర్మన్‌గా ఉండగా ఆఘమేఘాలపై కూల్చేసి రూ.600 కోట్లతో టెండర్లు పిలవడంపైనా విజిలెన్స్ విభాగం దృష్టి పెట్టింది. పటిష్ఠంగా ఉన్న ఆ సత్రాలకు మరమ్మతులు చేస్తే సరిపోయేదని నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.
అనధికార దుకాణాలు ఏర్పాటు : స్విమ్స్‌లో భవనాల పునర్నిర్మాణం, అభివృద్ధి పేరుతో రూ.197 కోట్లు కేటాయించేందుకు 2023 నవంబరులో తీర్మానం చేశారని, ఇక్కడ అవసరం లేకున్నా నిధులు ఖర్చు చేసేందుకు సిద్ధపడ్డారని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తిరుమలలో దుకాణాలను ఇష్టానుసారంగా కేటాయించారని విజిలెన్స్ విచారణలో తేల్చారు. తట్టల పేరుతో అనధికార దుకాణాల్ని ఏర్పాటు చేసినా చూసీచూడనట్లు వ్యవహరించారని నివేదికలో పొందుపర్చారు. లైసెన్సు ఒకరి పేరుతో ఉంటే లీజు పేరుతో అనేక మంది చేతులు మారినట్లు గుర్తించారు.
తిరుమల లడ్డూ వివాదం - వైరల్ అవుతున్న ప్రకాష్‌రాజ్ వరుస పోస్టులు - Prakash Raj vs Pawan Kalyan