Industries Minister TG Bharat Inspected Mallavalli Industrial Estates : కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి టీజీ భరత్ అన్నారు. గన్నవరం మండలం మల్లవల్లి, బాపులపాడు మండలం వీరపనేని గూడెం పారిశ్రామిక వాడలను స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి సందర్శించి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు.
పారిశ్రామికవేత్తలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని, ఎటువంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. జిల్లాలో ఉన్న ఈ రెండు పారిశ్రామిక వాడలను అతిపెద్ద పారిశ్రామికవాడలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ రెండు పారిశ్రామిక వాడల్లో విద్యుత్తు కోతల వల్ల ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నదని, తద్వారా నష్టం వాటిల్లుతున్నదని పారిశ్రామికవేత్తలు మంత్రికి వివరించారు.
వెంటనే మంత్రి విద్యుత్ అధికారులను పిలిచి సమస్య కారణాలు అడిగి తెలుసుకున్నారు. సబ్ స్టేషన్లో సిబ్బంది కొరత సమస్య పరిష్కరించాలని, విద్యుత్తు నిర్వహణ పక్కాగా నిర్వహించి కోతలు లేకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్ సమస్య పునరావృతం కారాదని హెచ్చరించారు. పరిశ్రమలకు విద్యుత్తు సరఫరా చాలా ముఖ్యమని పారిశ్రామికవేత్తగా పరిశ్రమ దారుల సమస్యలు తనకు తెలుసని అన్నారు. అశోక్ లేలాండ్ వంటి పెద్ద పారిశ్రామిక బ్రాండెడ్ సంస్థలు వస్తున్నాయని తెలిపారు. పారిశ్రామి వాడలలో బస్సు షెల్టర్, పోలీస్ పికెట్ వంటి కనీస వసతులు లేకపోవడం శోచనీయమని, వెంటనే ఏర్పాటు చేయాలని పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేయాలని అన్నారు.
నీటి సమస్య పరిష్కరించాలన్నారు. ఏపీని అభివృద్ధి రోల్ మోడల్‌గా చేయాలని ముఖ్యమంత్రి సంకల్పం అన్నారు. మల్లవల్లి, వీరపనేని గూడెం పారిశ్రామిక వాడల గుర్తింపునకు ప్రవేశ ద్వారాలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక వాడల చుట్టూ ప్రహరీ నిర్మించాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థ పక్కాగా ఏర్పాటు చేయాలని, గ్రీన్ జోన్ ఏర్పాటు చేసి గ్రీనరీ అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
గత ప్రభుత్వ హయంలో గన్నవరం అంటే ఆసాంఘీక శక్తులకు అడ్డగా ఉండేదని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడ అభివృద్దే తన లక్ష్యమన్నారు. పరిశ్రమలు వస్తే నియోజకవర్గంలో ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. గత టీడీపీ హాయంలో మల్లవల్లి పారిశ్రామిక వాడలో 478 కంపెనీకలకు స్థలాలు కేటాయించారని, ఇప్పుడూ ఇక్కడ ఎన్ని కంపెనీలు నడుస్తున్నాయని ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో మల్లవల్లి పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీరపనేని గుడెం, మల్లవల్లి పారిశ్రామిక వాడలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. పారిశ్రామిక వాడలు అభివృద్ది చెందితే గన్నవరం నియోజకవర్గ ప్రజలు వలస వెళ్లి దుస్థితి కూడా లేకుండా చేస్తానన్నారు.