Indians Caught in Hands of Cyber Criminals in Cambodia : నెలకు 1000 డాలర్ల వేతనం ఇస్తామని ఉద్యోగ ప్రకటనలు, ఏజెంట్ల ద్వారా కంబోడియాకు భారత్‌కి చెందిన నిరుద్యోగులు వెళ్లిన తర్వాత పాస్‌పోర్టులు లాక్కొని సైబర్ నేరాలను నేరగాళ్లు చేయించడం. రోజుకు 16 గంటలకు పైగా పని, నిరాకరిస్తే చిత్రహింసలు. ఇది ప్రస్తుతం కంబోడియా దేశంలో చిక్కుకున్న భారతదేశానికి చెందిన నిరుద్యోగుల పరిస్థితి. ఈ విషయం అటుఇటు చర్చనీయాంశం అవ్వడంతో రంగంలోకి కేంద్రం సైబర్ క్రైమ్ పోలీసులు, ఐ4సీలు దర్యాప్తు చేస్తున్నాయి.
సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. తనకు తెలిసిన మిత్రుడు అజయ్ మాల్దీవులకు వెళ్లడంతో అతడిని సంప్రదించాడు. అతడి సూచనతో జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన సాయి ప్రసాద్ అనే ఏజెంట్‌ను కలిశాడు. అతడు ఈ యువకుడి నుంచి రూ.1.4 లక్షలు తీసుకుని లక్నో, పుణె, బిహార్‌కు చెందిన ముగ్గురు యువకులతో కలిసి గత జనవరిలో కంబోడియాకు పంపించారు. నెలకు 950 యూఎస్ డాలర్ల వేతనంతో కూడిన ఉద్యోగం అని చెప్పారు. అక్కడికి వెళ్లిన తర్వాతగానీ శివకు తెలియలేదు తాను సైబర్ నేరస్తుల ముఠా చేతిలో బందీగా మారానని తెలుసుకోలేకపోయాడు.
బలవంతంగా సైబర్ దాడులు : అతడి వద్ద నుంచి పాస్‌పోర్టులు లాక్కొని బలవంతంగా సైబర్ నేరాలను ఆ ముఠా చేయించింది. మూడు నెలల పాటు ఆ శిబిరంలో మగ్గిన శివ అదను చూసుకొని భారత రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. అక్కడి వారి సహకారంతో బయటపడ్డాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏజెంట్లను అరెస్టు చేశారు. అదే క్యాంపులో తెలుగువారితో పాటు 500-600 మంది భారతీయులు ఉన్నట్లు చెప్పాడు. దీంతో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తాజాగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలతో విదేశీ సైబర్ ముఠాలు బురిడీ కొట్టిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి ప్రకటనలు చూస్తున్న ఏజెంట్లు వారిని సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో తమ కంపెనీల్లో విరివిగా ఉద్యోగావకాశాలున్నాయని, తమకు అవసరమైన యువకులను పంపిస్తే భారీ మొత్తంలో కమిషన్ ఇస్తామని ఏజెంట్లను ఆశపెడుతున్నారు. అలా మోసగాళ్ల వలలో పడుతున్న ఏజెంట్లు ఉద్యోగాలు కావాలనుకుని వారి వద్దకు వచ్చే యువతను విదేశాలకు పంపిస్తున్నారు. కొంతకాలం వరకు థాయిలాండ్, మయన్మార్‌లోని సైబర్ నేరస్థుల ముఠాలు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా కంబోడియా ఆ జాబితాలో చేరింది.
ఒప్పుకోకుంటే తీవ్ర పరిణామాలు : కంబోడియాకు విమానాల్లో వచ్చే యువకులను విమానాశ్రయాల నుంచే శిబిరాలకు తరలిస్తున్నారు. విమానాశ్రయాలకే వాహనాలను పంపిస్తూ వాటిల్లో తీసుకెళుతున్నారు. అనంతరం పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుంటున్నారు. అక్కడ కొద్దిరోజులపాటు సైబర్ నేరాలు ఎలా చేయాలనే అంశంపై శిక్షణ ఇస్తున్నారు. అనంతరం వీరితోనే ఫోన్లు చేయించి సైబర్ నేరాలకు పాల్పడేలా చేస్తున్నారు. ఈ పనులకు ఒప్పుకోకుంటే బెదిరింపులకు పాల్పడటంతో పాటు తీవ్రంగా కొడుతున్నారు.
అలాంటి క్యాంపులు కంబోడియాలో పలుచోట్ల ఉన్నట్లు ముఖ్యంగా వియత్నాం సరిహద్దుల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ముఠాల వెనక చైనా హస్తముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి శిబిరంలోకి ప్రవేశించాక బయటికి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. సైబర్ నేరాలు చేసే క్రమంలో మూడు నాలుగు బృందాలుగా విడగొడుతున్నారు. ఒక బృందం బాధితులను వలలో వేసుకునే పని చేస్తే మరో బృందం వలకు చిక్కిన బాధితుల నుంచి డబ్బులు రాబట్టే పనులు చేస్తుంది. వీరి టార్గెట్ ఎక్కువగా భారతీయులే. ముఖ్యంగా తెలుగు ప్రజల పైనా దృష్టి పెడుతున్నారు. అలా ఒక్కొక్కరితో రోజుకు 15 నుంచి 16 గంటలపాటు పని చేయిస్తున్నారు. అలా చేసినందుకు వేతనం ఇస్తున్నారు.
ఇప్పటివరకు రూ.500 కోట్ల వరకు దోపిడీ : కంబోడియా ముఠాల మోసాలపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు అందుతుండటంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ, ఐ4సీ ఇటీవలే జరిపిన సమీక్ష మేరకు కంబోడియా ముఠాలు భారీగా కొల్లగొట్టినట్లు తేలింది. భారత్‌లో ఉన్న బాధితుల నుంచి సుమారు రూ.500కోట్ల వరకు ఈ ముఠాలు కొల్లగొట్టినట్లు భావిస్తున్నారు.