Summer Special Trains : మీరు వేసవిలో విహార యాత్రకు, తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. భారతీయ రైల్వే వేసవికాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు సేవలు అందిస్తోంది. వేసవిలో రికార్డు స్థాయిలో 9,111 రైలు ట్రిప్పులను నడిపిస్తుంది. 2023 ఏడాది వేసవి కాలంలో 6,369 ట్రిప్పులను తిప్పింది. ఈ ఏడాది వేసవి సీజన్లో 2,742 ట్రిప్పులు అదనంగా నడుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైలు సేవలను విస్తరించినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన రైలు మార్గాల్లో రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దేశంలోని అన్ని జోన్లలో ఈ రైల్వే సేవలు అందుబాటులో ఉంటాయి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, బంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, దిల్లీ వంటి రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ రైళ్లను నడిపిస్తున్నారు.
కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
1079 Special Train Services : వేసవిలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఏప్రిల్, మే మాసాల్లో 1,079 ప్రత్యేక రైలు సేవలను ప్రకటించింది. ఉత్తర, తూర్పు దిశలలో ఉన్న సికింద్రాబాద్ - దానాపూర్ , హైదరాబాద్ - గోరఖ్‌పూర్, కాచిగూడ - కొచ్చువేలి , సికింద్రాబాద్ - అగర్తల , సికింద్రాబాద్ - సంత్రాగచ్చి , సికింద్రాబాద్ - షాలిమార్ , సికింద్రాబాద్ - పట్నా, తిరుపతి – షిర్డీ, కాచిగూడ – మధురై, సికింద్రాబాద్ - కొల్లాం, హైదరాబాద్ – కటక్, హైదరాబాద్ - రక్సాల్ మొదలైన ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్ల సేవలు అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. వీటితోపాటు సెలవుల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణికుల కోసం ముఖ్యనగరాల మధ్య ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- సికింద్రాబాద్ - తిరుపతి
- లింగంపల్లి - కాకినాడ
- హైదరాబాద్ - నర్సాపూర్
- తిరుపతి - విశాఖపట్నం,
- సికింద్రాబాద్ - విశాఖపట్నం
ప్రయాగ్‌రాజ్, వారణాసి, దానాపూర్ స్టేషన్ల మీదుగా ప్రయాణించే వారు భారీ సంఖ్యలో సాధారణ కోచ్‌లలో ప్రయాణం చేస్తుంటారు. దక్షిణ మధ్య రైల్వే కూడా సాధారణ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం దానాపూర్ వైపు 22 అన్‌రిజర్వ్‌డ్ వీక్లీ స్పెషల్ రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు పూర్తిగా రిజర్వ్ చేయని కోచ్‌లను కలిగి ఉంటాయని, సెలవుల్లో ఈ ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసే దిగువ మధ్యతరగతి, శ్రామిక్ కార్మికులు, తీర్థ యాత్రలు చేసే ప్రయాణీకులకు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు తెలిపారు.
Railways Focused On Traffic Control : వేసవిని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే అన్ని ప్రధాన, ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో మంచి నీటి సరఫరాపై దృష్టిసారించింది. రద్దీ నియంత్రణ కోసం విస్తృత వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్లలో అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, క్రమపద్ధతిలో రద్దీని నియంత్రించడానికి సీనియర్ అధికారులను నియమించారు. భారీ రద్దీ ఉండే సమయంలో తొక్కిసలాట తలెత్తకుండా గుంపును అదుపు చేయడం కోసం గవర్నమెంట్ రైల్వే పోలీసు (జిఆర్‌పి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పి.ఎఫ్) లకు చెందిన సిబ్బందిని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల వద్ద అందుబాటులో ఉంచామని అధికారులు స్పష్టం చేశారు.
South Central Railway : ఈ వేసవి సెలవుల్లో.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
రామభక్తులకు బీజేపీ బంపర్ ఆఫర్ - తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు