Indian Army is Reached Budameru Leakage Area : బుడమేరులో గండి పడిన ప్రాంతానికి ఆర్మీ పెద్ద స్థాయిలో చేరుకుంది. 6th మద్రాస్ రెజిమెంట్ నుంచి 120 మంది అధికారులు, ఆర్మీ జవాన్లు వచ్చారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల్లో సైన్యం నిమగ్నమైంది. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. గండ్లు పడినచోట 10 నుంచి 15 మీటర్ల వెడల్పు ఉన్నట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. మూడో గండి 80 నుంచి వంద మీటర్ల వరకు ఉందని తెలిపారు.
గేబియాన్ బుట్టల ద్వారా గండ్లు పూడ్చాలని నిర్ణయించారు. బుట్టలు ఒకదానిపై ఒకటి పేర్చి, గండ్లు పూడ్చేందుకు రాళ్లు వేస్తామని తెలిపారు. బుట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షితకట్ట నిర్మిస్తామని అన్నారు. గేబియన్ బుట్టల తయారీ స్థానికంగానే జరుగుతోందని స్పష్టం చేశారు. ఇసుక సంచులతో నింపిన హెస్కో బుట్టలు కూడా వాడతామని తెలిపారు. గండ్లను పూడ్చేందుకు ఆర్మీ హెచ్‌ఏడీఆర్ బృందం పని చేస్తోందని సైన్యం తెలిపింది. గండ్లు పూడ్చివేత పనుల్లో పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.