Incomplete of Nadu Nedu School Works: ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన 'నాడు- నేడు' పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఐదారు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు సంస్థలు సామాగ్రి సరఫరాను నిలిపివేశాయి. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈలోపు పనులు పూర్తి కాకపోతే బడులకు వచ్చే పిల్లలకు ఇబ్బందులు తప్పవన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 600కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కొన్ని స్కూళ్లను నిధుల సమస్య వెంటాడుతోంది. భవన నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోవటమే కాక అనేక పాఠశాలల్లో విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయలేదు. బాత్‌రూముల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయాయి. ఇసుక ఆర్డర్ పెడితే ఎప్పుడొస్తుందో తెలియడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. సిమెంటు కంపెనీలకు బకాయిలు పేరుకుపోవడంతో సరఫరాను నిలిపేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పనులు త్వరగా పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు.
నిలిచిన నాడు-నేడు నిధులు - శిథిలావస్థకు రాళ్లపేట ప్రాథమిక పాఠశాల - RALLAPETA PRIMARY SCHOOL PROBLEMS
అనంతపురంలోని పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ పాఠశాలలో నాడు- నేడు కింద 9 గదుల నిర్మాణం చేపట్టారు. 3 గదులకు పైకప్పు వేయడానికి నిధులు లేక పనులు నిలిపేశారు. పాఠశాల గదుల్లో నిర్మాణ సామాగ్రి ఇటుకలు, కంకర కుప్పలుగా పోశారు. ఉరవకొండ మండలం మోపిడిలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా 14,089 మరుగుదొడ్లు నిర్మించేందుకు పనులు చేపట్టారు. చాలా చోట్ల ఈ నిర్మాణాలు పూర్తయినా వాటికి తలుపులు బిగించలేదు. గుత్తేదార్లకు బిల్లులు చెల్లించకపోవడంతో తలుపులు సరఫరా చేయలేదు. సిమెంటు కొరత కారణంగా చాలాచోట్ల పనులు సాగడం లేదు. మరికొన్నిచోట్ల తలుపులు, కిటికీలు సరఫరా చేయలేదు. పలుచోట్ల తరగతి గదుల నిర్మాణం పునాదుల దశల్లోనే ఉంది. దీంతో ఈ ఏడాదీ తరగతి గదుల కొరత తప్పేలాలేదు.
నాడు-నేడు పనుల్లో నాణ్యతా లోపం- పాఠశాలల్లో విద్యార్థుల ఇక్కట్లు - Nadu Nedu Work Incomplete
తలుపులు, కిటికీల సరఫరా నిలిపివేసిన గుత్తేదార్లు: గుత్తేదార్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో రెండో విడత నాడు- నేడు పనులు చేపట్టిన చాలా బడులకు ఆర్వో ప్లాంట్లు సరఫరా చేయలేదు. కొన్నిచోట్ల సరఫరా చేసినా, వాటిని బిగించలేదు. మొదటి విడతలో ఏర్పాటుచేసిన వాటిల్లోనూ కొన్ని పని చేయట్లేదు. బకాయిల కారణంగా పాఠశాలలకు రంగులు వేసే పనులు నిలిచిపోయాయి. శ్లాబ్‌లకు మరమ్మతులు సక్రమంగా చేయకపోవడంతో పెచ్చులు ఊడుతున్నాయి.
పరీక్షలు, ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉన్న ఉపాధ్యాయులపై నాడు- నేడు పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో కిటికీలు, తలుపులు, ఆర్వో పాంట్లు బిగించాల్సి ఉంది. వాటిని అమర్చడానికి ప్రభుత్వం టెక్నీషియన్లను పంపడం లేదు. ఇన్ని సమస్యల మధ్య అసంపూర్తి నిర్మాణాలు నెలాఖరిలోపు ఎలా పూర్తవుతాయని ప్రధానోపాధ్యాయిలు ఆందోళన చెందుతున్నారు.