Rain Alert in telangana : ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు, మరో నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ కారణంగా రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. శుక్రవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని తెలిపింది.
ఇప్పటికే అన్నీ జిల్లాలోని అధికారులకు సూచనలు జారీ చేసిన ఐఎండీ, హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లోనూ ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.
హైదరాబాద్‌లో ముందస్తు చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ : గత రెండ్రోజుల నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గురువారం కురిసిన వానకు హైదరాబాద్‌లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నగరంలోని ఆయా ప్రాంతాల్లో వర్షం నీళ్లు నిలిచిపోకుండా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ముందే డ్రైనేజీ, కాలువలో చెత్తను తొలిగిస్తున్నారు.
మరోవైపు నైరుతి రుతుపననాలు గురువారమే తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని ప్రాంతాల్లో ప్రవేశించాయి. రాబోయే మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో ఆయా పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం గురువారం రాయలసీమ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.
రైతులు సైతం వర్ష సూచనలు ఉండటంతో కాస్త కుదటపడ్డారు. దీంతో ఈసారి అయినా వర్షాలు బాగా పడి పంటలు వృద్ధిగా పండాలని కోరుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో పిడుగుపాటుకు గురై గురువారమే వేర్వేరు ప్రాంతాల్లో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. దీంతో వాతావరణ శాఖ ముందస్తుగా ఆయా జిల్లాలోని అధికారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
నేడు, రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు - Rain Alert in Telangana
ఏపీలో విస్తరించిన రుతుపవనాలు - పలు జిల్లాల్లో జోరు వానలు - HEAVY RAINS IN ANDHRA PRADESH TODAY