Heavy Rainfall Alert in Telangana : రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. మంగళవారం మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
బుధవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. వాతావరణ శాఖ ఈ రెండ్రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఈ నెల 9 నుంచి 10 ఉదయం వరకు రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల, దోమ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలలో 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. మరోవైపు రాష్ట్రంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువన నమోదయ్యాయి.
పిడుగుపాటుకు కబళించిన మృత్యువు : రాష్ట్రంలోని ఆయా జిల్లాలో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. సోమవారం రోజున సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం కోడూర్లో పిడుగుపాటుకు గురై యువతి మృతి చెందింది. పొలంలో పత్తి విత్తనాలు వేస్తుండగా ఉరుములు మెరుపులతోకూడిన భారీ వర్షం పడటంతో అక్కడున్న కూలీలందరూ చెట్టు కిందకు వెళ్లి నిల్చున్నారు. ఈ క్రమంలో చెట్టుపై పిడుగుపాడి యాస్మిన్ బేగం అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా అనూష అనే యువతి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
జూన్ 6న కూడా రాష్ట్రంలో వేర్వేరు చోట్ల పిడుగుపాటు పడి తొమ్మిది మృతి చెందారు. వీరిలో చాలామంది చెట్టు కింద ఉండటం వల్లే పిడుగుపాటుకు గురై అక్కక్కడికే కూప్పకూలిపోయారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పడు హెచ్చరికలు జారీ చేస్తోంది. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ అధికారులు సైతం లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలవకుండా చర్యలు చేపడుతున్నారు.