IMD Issues Rainfall Alert to Andhra pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఇవాళ, రేపు కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల 9వ తేదీకి ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు.
దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
విజయవాడ నగరంలో మరోసారి భారీవర్షం కురుస్తోంది. దీంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో బురదను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నిత్యావసర సరకులను అందజేస్తోంది. బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా శనివారం మూడో గండిని పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేశ్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో సాయంత్రం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. తిరువూరు పట్టణ ప్రధాన రహదారి కాలువను తలపిస్తోంది. తిరువూరు బైపాస్ రోడ్డు కూడలి నుంచి ఫ్యాక్టరీ సెంటర్ వరకు మోకాలి లోతులో ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తుంది. ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువన తెలంగాణ నుంచి వచ్చి చేరుతున్న వరదతో వాగుల్లో ప్రవాహం పెరిగింది. కట్లేరు, ఎదుళ్ల, విప్ల, పడమటి, గుర్రపు, కొండ, అలుగు వాగులు తిరువూరు నియోజకవర్గంలో మరోసారి పరవళ్లు తొక్కుతున్నాయి. తిరువూరు-అక్కపాలెం రహదారిలో ఇటీవల కోతకు గురైన చెరువుల కరకట్టలు, ప్రధాన రహదారి. గండ్లు పూడ్చకపోవడంతో కరకట్టలు తెగిపోతాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శరవేగంగా పారిశుద్ధ్య పనులు - డ్రోన్ల సాయంతో బ్లీచింగ్ పిచికారి - drones for vijayawada sanitation