IG Ashok Kumar Said No Hidden Cameras Found in Engineering College : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కళాశాలలో ఎటువంటి రహస్య కెమెరాలు దొరకలేదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని వెల్లడించారు. విచారణలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రుల అనుమానాలు తీర్చామన్నారు. ఈ ఘటనపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (Computer Emergency Response Team) సేవలు వినియోగించామని వెల్లడించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశామన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవహారంపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేశారన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందని ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు.
ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరు చెప్పలేదు : హాస్టల్ వాష్ రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్ రూముల్లో తనిఖీలు చేశామన్నారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించామని చెప్పారు. విచారణలో కెమెరాలు కానీ, ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదన్నారు.
ఎవరో చెప్తేనే తమకు తెలిసింది : కెమెరాల ఏర్పాటు, వీడియోలు అంశం ఎవరో చెప్తేనే తమకు తెలిసిందనీ విచారణలో అందరు చెప్పారన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న 14 ఫోన్లు, 6 ల్యాప్ ట్యాప్లు, ఒక ట్యాబ్‌ను CERT బృంద సభ్యులకు అప్పగించామన్నారు. విద్యార్థులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మరో మూడు రోజుల్లో CERT టెక్నికల్ విచారణ నివేదిక కూడా వస్తుందన్నారు. ఈ ఘటనపై ఏటువంటి ఆధారాలున్న పోలీసుల దృష్టికి తేవచ్చని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వసతి గృహం బాత్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. కెమెరాలతో చిత్రీకరించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్‌గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే నేరుగా తనకే పంపాలని విద్యార్థినులను ఆయన కోరారు. తప్పు చేసింది ఎంతటి వారినైనా ప్రభుత్వం వదిలిపెట్టదని విద్యార్థుల తల్లిందండ్రులకు భరోసా ఇచ్చారు.
గదులలో దాచిన స్పై కెమెరాలను గుర్తించాలా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి - find out Hidden cameras