IAS RP Sisodia Comments on IAS And IPS : కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖపై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనంతర కలెక్టర్లు, ఐఏఎస్‌ల పని తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు, ఐఏఎస్‌ల వ్యవస్థపై రాష్ట్ర ప్రజల్లో గత ఐదు ఏళ్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో సోదాహరణంగా చెప్పారు.
AP Collectors Conference : ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న నమ్మకం ప్రజలకు సడలిపోతే ఇక కలెక్టర్లు, ఐఏఎస్‌ల వ్యవస్థ అర్థరహితంగా మిగిలిపోతుందని అన్నారు. భూ వివాదాలు ఎప్పుడూ ఇన్ని లేవని గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని కుండబద్దలు కొట్టారు. గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. సిసోదియా ఇంకా ఏమన్నారంటే..
కలెక్టర్లు, ఎస్పీలపై బాధ్యత ఉంది : ఒకప్పుడు జన్మభూమి (JnanaBhumi) పేరుతో గ్రామ సదస్సులు నిర్వహించేవారని సిసోదియా గుర్తు చేశారు. అప్పట్లో తాను కలెక్టర్‌గానో, ప్రత్యేకాధికారి గానో వాటికి వెళ్లే వాడినని, మొత్తం ఫిర్యాదుల్లో భూములకు సంబంధించినవి 10 శాతం లోపు మాత్రమే ఉండేవని, అవి కూడా భూమి మార్పిడి, ఇళ్ల పట్టాలు, సరిహద్దు తగాదాలు వంటి చిన్న చిన్న సమస్యలే ఉండేవని అన్నారు.
ప్రస్తుతం ఒక్కసారిగా భూములకు సంబంధించిన సమస్యలు 50 నుంచి 60 శాతం వరకు వస్తున్నాయని, అవి కూడా చిన్న సమస్యలు కావని, భూమి లాక్కున్నారని, దౌర్జన్యంగా కబ్జా చేసేశారని, నా భూమికి హద్దు గోడలు కట్టుకుంటే బద్దలు కొట్టేశారు లాంటి ఫిర్యాదులే అన్నీ తెలిపారు. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలపై ఉందని వెల్లడించారు. తమ భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారని చాలా మంది పేదలు చెబుతున్నారని, పేదల ప్రయోజనాలు కాపాడేలా ఎస్పీలు ఆ దౌర్జన్యాన్ని నిరోధించాలని ఆయన అన్నారు.
ఐఏఎస్ వ్యవస్థ ఎక్కడ ఉన్నట్లు? : ఈ మధ్య మదనపల్లెలో భూ వివాదాలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వెళ్లానని, వందల మంది వచ్చారని, అర్థరాత్రి దాటిపోయిందని సిసోదియా అన్నారు. కలెక్టర్ కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పానని, అక్కడ కలెక్టర్ కూడా కొత్తగా వచ్చారని, కానీ కలెక్టర్‌కు వారి బాధ చెప్పేందుకు ప్రజలు అంగీకరించలేదని తెలిపారు. తాను ఏదో ఒక అధికారినీ లేదా ఓ కలెక్టర్‌ను ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం లేదని అన్నారు. నిజానికి ప్రభుత్వం అంటే కలెక్టర్ అని, పాలనకు ప్రతిరూపమని, అలాంటి కలెక్టర్ల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలిపోతే మనందరి భవిష్యత్తు అంధకారమవుతుందని పేర్కొన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో కలెక్టర్లు, ఎస్పీలు ప్రజల కోణం నుంచి ఆలోచించి వారి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉండాలని తీర్మానించుకుందామని సిసోదియా పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్టుగా పని చేయకపోతే ఐఏఎస్ వ్యవస్థ అనేది అర్థరహితమవుతుందని, తనకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ప్రజలు చెబుతోంటే ఇక ఐఏఎస్ వ్యవస్థ ఎక్కడ ఉన్నట్లు? అని ప్రశ్నించారు. ఎక్కడెక్కడో ఊళ్ల నుంచి అనేక మంది సచివాలయానికి వస్తున్నారని అన్నారు.
వీఆర్వో సమస్యలు పరిష్కరించడం లేదంటున్నారని, పట్టా పుస్తకం ఉన్నా రిజిస్ట్రేషన్ చేయడం లేదంటున్నారని, తహసీల్దార్లు పట్టించుకోవడం లేదంటున్నారని తెలిపారు. కలెక్టర్లను కలిసి చెబుదామనుకున్నా వారు అందుబాటులో ఉండటం లేదంటున్నారని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా పెరిగిపోయిన భూ వివాదాలను చూస్తోంటే ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అర్థమవుతోందని తెలిపారు. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన ఆవేదనగా చెప్పారు.
కార్యాలయాల్లో సీసీ కెమెరాలు కూడా లేవు : అనుమానస్పద రిజిస్ట్రేషన్లపై కలెక్టర్లు విచారణ జరిపించాలని సిసోదియా కోరారు. భూ రికార్డులను భద్రపరిచాలని రెవెన్యూ కార్యాలయాల్లో సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్లను జాగ్రత్త చేయాలని సూచించారు. చాలా కార్యాలయాల్లో సీసీ కెమెరాలు కూడా లేవని, పాలన ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. 56 ఏళ్లున్న వీఆర్ఎను కాపలా పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలు నడుపుతామా అని అన్నారు. క్షేత్ర స్థాయిలోని పిటిషన్లు సీఎం వద్దకు వస్తే, కలెక్టర్లు విఫలమైనట్టే అన్నారు. రికార్డులను భద్రపర్చే విషయంలో పోలీసుల సహకారం తీసుకోవాలని వెల్లడించారు.
వర్గచిచ్చుగా మారిన భూఆక్రమణలు.. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై ఆరోపణలు