Hyper Aadi Reaction on Janasena Contesting 24 Seats : జనసేనకు తక్కువ సీట్లు కేటాయించారంటూ జరుగుతున్న ప్రచారంపై జనసైనికులకు, నటుడు హైపర్ ఆది ఓ వీడియో సందేశం ఇచ్చారు. జనసేనకు 24 సీట్లు అని ప్రకటించినప్పటి నుంచి పవన్ కల్యాణ్‌ని(Pavan Kalyan) విమర్శిస్తున్నారని, అదే విధంగా కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని, మరికొంత మంది జనసేన జెండాని కిందపడేసి తొక్కుతున్నారని ఆది ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక, ఎంతో బాధతో జనసైనికులకు, వీరమహిళలకు వీడియో ద్వారా సందేశాన్ని పంపిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సందేశాన్ని జనసేన నేత నాగబాబు 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
ఒక్కసారి ఆలోచించండి: జనసైనికులు ఆవేశంతో కాకుండా ఆత్మసాక్షిగా ఆలోచించాలని హైపర్ ఆది కోరారు. తనను నమ్ముకున్న ప్రజలను, తనతో నడుస్తున్న నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది కాదని పేర్కొన్నారు. పెట్టిన పార్టీకి సపోర్టు చేస్తున్న ప్రజలే ఇంతగా ఆలోచిస్తుంటే, అదే పార్టీని పెట్టిన పవన్ కల్యాణ్ ఎంతగా ఆలోచించారో కదా అని ప్రశ్నించారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి తనలో తాను ఎంతగా మదన పడ్డారో ఒక్కసారి ఆలోచించాలని హైపర్ ఆది కోరారు.
ఆ హక్కు మనకు నిజంగా ఉందా: పది సంవత్సరాలుగా ఎటువంటి అవినీతి చేయకుండా, తన సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆది కొనియాడారు. అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్లు జనసైనికులు కూడా మాట్లాడటం చూసినప్పుడు చాలా బాధగా అనిపించిందని అన్నారు. 2019 ఎన్నికలలో కనీసం పవన్ కల్యాణ్‌ని కూడా గెలిపించుకోలేదని, ఇప్పుడు 24 సీట్లపై ప్రశ్నించే హక్కు జనసైనికులుగా మనకు ఉందా అని ప్రశ్నించారు.
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి : బాబు, పవన్
రెండు చోట్లా ఓడిపోయినా సరే: మామూలుగా ఎవరైనా సరే చిన్న పరీక్ష ఫెయిల్ అయితేనే చాలా రోజులు ఇంటి నుంచి బయటకిరారని, అలాంటిది పవన్ కల్యాణ్ మాత్రం రెండు చోట్లా ఓడిపోయినా సరే సమస్య అనేసరికి రెండో రోజే బయటకు వచ్చి దానిని పరిష్కరించారని తెలిపారు. తన పిల్లల కోసం బ్యాంకులో దాచిన డబ్బులు సైతం తీసి కౌలు రైతుల సమస్యలను తీర్చిన పవన్ కల్యాణ్ గురించి ఈ రోజు విమర్శలు చేస్తున్నారని ఆది ఆవేదన చెందారు. ఈ విధంగా పవన్ కల్యాణ్ ఎన్నో సమస్యలను పరిష్కరించారని అన్నారు.
జనసేన అధినేత పవన్‌ను కలిసిన షర్మిల - కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రిక అందజేత
ఆ విషయం ఎంతమందికి తెలుసు: రోజుకు రెండు కోట్ల రూపాయలు రెమ్యునిరేషన్గా తీసుకునే ఒక స్టార్ హీరో అయిన పవన్ కల్యాణ్, డబ్బంతా ప్రజలకు పంచిపెట్టేసి అప్పులు తీసుకొని మరీ పార్టీని నడుపుతున్నారనే విషయం ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు విమర్శలు చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు.
డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి కాదు: దేశంలో అనేక పార్టీలు ఉన్నాయని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేస్తామో చెప్తున్నారని అన్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తన సొంత జేబు నుంచి నుంచి డబ్బులు తీసిమరీ సహాయం చేశారని తెలిపారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని కులాన్ని తాకట్టు పెట్టాడు, ప్యాకేజీ తీసుకున్నాడు, పార్టీని తాకట్టుపెట్టాడు అంటూ ఈరోజు చాలామంది సింపుల్‌గా అనేస్తున్నారని ఆది పేర్కొన్నారు. డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి పవన్ కల్యాణ్ కాదని స్పష్టం చేశారు.
ప్రజల పంచే ప్రేమకు మాత్రమే బానిస: ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే, అధికారపక్షంలో ఉన్న వారి దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయని, పవన్ కల్యాణ్ అమ్ముడు పోయే వ్యక్తి అయితే వారే కొనుక్కోవచ్చు కదా అని ఆది ప్రశ్నించారు. ప్రజల పంచే ప్రేమకు మాత్రమే పవన్ కల్యాణ్ బానిస అని, నాయకులు పంచే డబ్బులకు కాదని హైపర్ ఆది స్పష్టం చేశారు. ఒక నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటమే నిజమైన అభిమానమని పేర్కొన్నారు. అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టి, లేనప్పుడు బై చెప్పడం కాదని ఈ సందర్భగా ఆది తెలిపారు. ఎవరో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వాటిని చూసి మనమే మన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడకూడదని జనసైనికులకు సూచించారు.
వైఎస్సార్సీపీకి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది - రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయి : చంద్రబాబు
ఎన్నికల తంతు అంతా సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి చెప్పినట్టే : చంద్రబాబు