HYDRA Victims At Telangana Bhavan On Demolitions Of Hydra : హైడ్రా, మూసీ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఈ పదాలు తమకు కంటిపై కునుకు లేకుండా చేసి, మనోవేదనకు కారణం అవుతున్నాయని హైడ్రా బాధితులు బీఆర్ఎస్ భవన్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని హైడ్రా బాధితులు బీఆర్‌ఎస్ నాయకులను కలిసేందుకు తెలంగాణ భవన్‌కు వచ్చారు.
'మా ఇళ్లను కూడా హైడ్రా కూల్చేస్తుందేమో' - భయంతో మహిళ ఆత్మహత్య - Woman Suicide Due to Hydra
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తమకు నిర్మాణానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇచ్చారని, ఇప్పుడు కూల్చేస్తామనడం సరికాదన్నారు. అప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు అసలు ప్రభుత్వం తరఫున ఎలాంటి సమాచారం ఉండడం లేదని, అధికారులతో మాట్లాడిన కూడా స్పందన కరువైందని వాపోయారు. బీఆర్ఎస్ నేతలను కలిసి తమ గోడును వెళ్లబోసుకునేందుకు వచ్చామని తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే, తమ సొంత జీతాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కానీ, ఇలా అక్రమంగా ఇళ్లు కూల్చేయడం సరికాదని మండిపడ్డారు.
"మాకు నిద్ర కూడా పట్టడం లేదు. అసలు మేము కొన్నప్పుడు ఇలాంటివి ఏవీ మాకు తెలియదు. లక్షల కొద్ది బ్యాంకు లోన్లు తెచ్చుకుని మేము ఇళ్లు కట్టుకున్నాం. మా పిల్లలు రోడ్డున పడతారు. మాకు అండగా ఉంటారని మేము బీఆర్ఎస్ భవన్‌కు వచ్చాం. తెల్లారితే అసలు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. మా పిల్లల భవిష్యత్ నాశనం అవుతుంది." - హైడ్రా బాధితులు
హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు వచ్చిన తర్వాత మాజీ మంత్రి హరీశ్ రావు అక్కడికి చేరుకున్నారు. తమ సమస్యలను ఆయనకు వివరించారు. రెండు దశాబ్దాల నుంచి తాము అన్ని అనుమతులతో మూసీ పరీవాహక ప్రాంతంలో ఉంటున్నామని ఆయనకు తెలిపారు. తాము నిజాయతీగా కష్టపడిన సొమ్ముతో, లోన్లు తీసుకుని కట్టుకున్నామని, జీవితం అంతా దారబోసి కట్టుకున్న కలల ఇళ్లు కూలుస్తారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
రిటైనింగ్ వాల్ కట్టండి, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో మాకు అనుమతులు ఎలా ఇచ్చారు? లోన్లు ఇచ్చే ముందు ఎంత న్యాయ ప్రక్రియ ఉంటుందో అందరికీ తెలుసు. అవన్నీ క్లియర్ అయితేనే కదా బ్యాంక్‌లు లోన్లు ఇచ్చేవి. మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. అన్నీ లీగల్ చెక్ పాయింట్స్ దాటి ఇక్కడ వరకు వస్తే ప్రభుత్వం ఇలా చేయడం ఏంటి?" - బాధితులు
తాము ఇల్లు కట్టుకునేటప్పుడు బఫర్‌జోన్ అని ఎవరూ చెప్పలేదని, ఇప్పుడు అంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీవీ ఆన్ చేస్తే ఈ ప్రభుత్వం ఏం చెబుతుందో అని భయం అవుతుందన్నారు. రాత్రి పడుకుంటే ఉదయం లేస్తామో గుండెపోటుతో పోతామో తెలియని మనో వేదన అనుభవిస్తున్నామని వాపోయారు. టీవీలలో వారిని ఆక్రమణ దారులు అంటున్నారని, తమకు అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చింది, దయచేసి అలా అనకండని వేడుకున్నారు.
కేసీఆర్‌ను మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది: డీకే అరుణ