Hydra Notices to Telangana CM Revanth Reddy Brother Tirupati Reddy : చెరువులు, నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా గుబులు రేపుతోంది. ‘హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. తాజాగా దుర్గం చెరువులోని కాలనీల్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని 204 ఇళ్లకు ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులిచ్చారు.
హైటెక్‌సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు వెలిసిన విషయం తెలిసిందే. ఈ భవనాల్లో సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఉంది. ఈ ఇంటికి తాజాగా హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి నివాసం ఉండగా ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు.
హైడ్రాకు జై' కొడుతున్న జనం - మాకూ కావాలంటున్న జిల్లాలు - WE WANT HYDRA IN OUR DISTRICTS
మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు పలు కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. నెలలోగా ఈ అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు.
100 ఎకరాల చెరువును 84కి కుదించి : కాగా దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లోని నిర్మాణాలకు గతంలోనే అధికారులు మార్క్ చేశారు. నాన్ డెవలప్‌మెంట్ జోన్‌గా దుర్గం చెరువును గుర్తించారు. సుమారు 100 ఎకరాలు ఉన్న దుర్గం చెరువు 84 ఎకరాలకు తగ్గినట్లు అధికారులు గుర్తించి పలు సెలబ్రిటీలు, అధికారులు, రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేశారు. అయితే రెవెన్యూ అధికారుల నోటీసులపైన నిర్మాణదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులపై కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తిరుపతిరెడ్డి కార్యాలయం, నివాసం చిత్రీకరించేందుకు వచ్చిన మీడియా సిబ్బందిని అతని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.