Hydra Focus On Himayat Sagar Illegal Constructions : హైడ్రా బుల్డోజర్లు ఇక హిమాయత్‌సాగర్ వైపే సాగనున్నాయి. వారంలో జలాశయంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశారు. జలమండలి, రెవెన్యూ అధికారులు ఎఫ్‌టీఎల్ (పూర్తిస్థాయి నీటి మట్టం) పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తించే ప్రక్రియను మొదలెట్టారు. తొలి దశలో కొందరు ప్రముఖుల ఫామ్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాలు ఇందులో ఉన్నట్టు తేలింది.
కాంగ్రెస్ పార్టీ నేతల వంతు : అధికార కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలతోపాటు ఇతర పార్టీలు, ప్రముఖుల బంగ్లాలు ఈ జలాశయ పరిధిలో ఉన్నాయి. వాటి నుంచి పది భారీ కట్టడాలను అధికారులు ఎంపిక చేశారు. అధికార పార్టీ ప్రెజెంట్ ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంతోపాటు ఇతర నేతల ఫామ్‌హౌస్‌లు తెరపైకి వచ్చాయి. ఆయా కట్టడాలు ఎఫ్‌టీఎల్ పరిధి లోపల ఎంత వరకు ఉన్నాయి. బఫర్‌జోన్ లోపల, వెలుపల ఎంత మేర ఉన్నాయనే వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని హైడ్రా కార్యాలయం జలమండలి, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించింది. వచ్చే సోమవారానికి నివేదికను పూర్తి చేస్తామని అధికారులు గురువారం హైడ్రాకు రిపోర్ట్ చేశారు.
జలాశయాల రక్షణ లక్ష్యం : ఈ నెల 11న గండిపేట జలాశయంలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. సెంట్రల్ మినిస్టర్లు , ఎంపీలు, ఎమ్మెల్యేలు, వ్యాపార వేత్తల ఫామ్‌హౌస్‌లు, హోటళ్లు, క్రీడా ప్రాంగణాలను నేలమట్టం చేశారు. అనంతరం నగరంలోని తమ్మిడికుంటలో నిర్మించిన ప్రముఖ సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చింది. అదేవిధంగా ఈర్లకుంట, చింతల్‌చెరువు, తదితర తటాకాల్లోని ఆక్రమణలను తొలగించారు.
ఇప్పుడు హిమాయత్‌సాగర్ పరిధిలోని ఆక్రమణలపైనా హైడ్రా అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. మొదటి దశలో ఎఫ్‌టీఎల్‌లోని పెద్ద బంగ్లాలను కూల్చుతామని, అనంతరం బఫర్‌జోన్‌లోని కట్టడాలను నేలమట్టం చేస్తామంటూ స్పష్టం చేశారు. జలమండలితోపాటు ఇతర శాఖ అధికారులు క్షేత్రస్థాయి సమాచారంతోపాటు గూగుల్ మ్యాప్‌లతో అక్రమ నిర్మాణాలను ఐడెంటిఫై చేస్తున్నారు.
CS Shanthi Kumari Meet With Hydra Officials : మరోవైపు హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రాకు రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సీఎస్ అధికారులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి హైడ్రా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లు కూడా హాజరయ్యారు. లీగల్ ఇష్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎస్ చర్చిస్తున్నారు.
ఎవరైనా సరే తగ్గేదేలే - తెలంగాణ సీఎం సోదరుడికి హైడ్రా నోటీసులు - Hydra Notices to CM Brother