Hydra Demolishing Illegal Structures : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడుతూనే అనుమతులు ఇచ్చిన అధికారులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అనధికారిక నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విషయంలో చాలా సీరియస్‌గా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు. మొదట్లోనే చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన అన్ని విభాగాలకు లేఖలు రాశారు. అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు వెల్లడించారు.
హైడ్రా కమిషనర్ అన్నట్లుగానే ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సైబరాబాద్ కమిషనర్‌కు రంగనాథ్ సిఫారసు చేశారు. జీహెచ్ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్‌తో పాటు హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, సర్వేయర్ సహా బాచుపల్లి తహశీల్దార్‌పై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. బాచుపల్లి ఎర్రకుంటలో ఇటీవల హైడ్రా అక్రమంగా నిర్మిస్తున్న మూడు భవనాలు నేలమట్టం చేసింది. ఆ భవనాలపై స్థానికుల నుంచి వరుస ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోలేదని అధికారులపై అభియోగాలున్నాయి.
అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు : అంతేకాకుండా ఆధారాలతో సహా సమర్పించినా పక్కనపెట్టేశారని హైడ్రా దృష్టికి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులను, అధికారులపై అభియోగాలను పరిశీలించిన రంగనాథ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఇప్పుడు వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. వీరితోపాటు గండిపేట వద్ద ఖానాపూర్, చిల్కూరులోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి సూపరింటెండెంట్‌పై కూడా చర్యలు తీసుకునేందుకు హైడ్రా ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతులను మొదట పరిశీలించి ఆ తర్వాత బఫర్ జోన్ లో ఉన్నవాటిపై దృష్టి పెట్టాలని హైడ్రా భావిస్తోంది. అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులను ఎవరిని ఉపేక్షించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీరుపారుదల, మున్సిపల్ శాఖల్లో అక్రమ అనుమతులపై జాబితాను సిద్ధం చేసిన హైడ్రా శాఖల వారీగా పెద్ద ఎత్తున క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అధికారుల్లో ఆందోళన : హైడ్రా నిర్ణయంతో కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు ఆక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం వరకే హైడ్రా చేసింది. ఇప్పుడు అక్రమదారులపై, అవినీతి అధికారులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతుండటం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
'హైడ్రా' కూల్చివేతలు - హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎస్ సమీక్ష
ఆక్రమణలతో హైదరాబాద్ అల్లకల్లోలం - హైడ్రా రాకతో ఆ అధికారుల్లో హడల్ - Land Encroachment in Telangana