Commissioner Ranganath On HYDRA Project : కబ్జాదారులు చెరువులను చెరపడుతూ హైదరాబాద్ మహానగరాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా తొలి ప్రాధాన్యతగా చెరువుల పరిరక్షణ కోసం నడుం బిగించిందన్నారు. ఈవీడీఎంలోని సిబ్బంది, 10 మంది అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చి వేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 1979 నుంచి 2023 వరకు అందించిన నగర పరిధిలోని దాదాపు 56 చెరువుల శాటిలైట్ చిత్రాలను పరిశీలించామని, అందులో కొన్ని 60 శాతం, మరికొన్ని 80 శాతం మేర కుంచించుకుపోయినట్లు రంగనాథ్ వెల్లడించారు.
హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచే హుస్సేన్ సాగర్ కూడా 21 శాతం కబ్జాకు గురైనట్లు రంగనాథ్ వివరించారు. అలాగే బతుకమ్మ కుంట, తుమ్మలకుంట వందకు వంద శాతం కనుమరుగైందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా మూడు దశల్లో పని చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. మొదటి దశలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి కట్టడి చేయడం, రెండో దశలో ఇప్పటికే నిర్మించిన వాటిని కూల్చివేయడం, మూడో దశలో గొలుసు కట్టు చెరువులకు ప్రాణం పోసేలా నాలాలను పరిరక్షించడం, చెరువుల్లో పూడిక తీయడం చేస్తామని రంగనాథ్ వివరించారు.
"గొలుసుకట్టు చెరువులన్నీంటిని పునరుద్ధరిస్తాం. చెరువులకు నీటిని మళ్లించే నాలాలు పూడుకుపోయాయి. అవకాశవాదం వల్ల గొలుసుకట్టు చెరువులన్నీ మాయం. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దు. చెరువుల పరిరక్షణకు అందరితో కలిసి మేథోమదనం చేస్తాం. పార్కు స్థలాలు పరిరక్షించే కాలనీ సంఘాలను సమర్థిస్తాం. పార్కు స్థలాల్లో ఫెన్సింగ్ వేసేందుకు కాలనీ సంఘాలు సహకరిస్తున్నాం. బస్తీ వాసుల మెరుగైన జీవన ప్రమాణాలు పెరగాలి." - రంగనాథ్, హైడ్రా కమిషనర్
ఈ ప్రక్రియలో హైడ్రాకు ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకు సాగుతామన్న కమిషనర్, హైడ్రా ఏర్పడి నెల రోజులు పూర్తి కాక ముందే ప్రజల నుంచి రోజుకు వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కొంతమంది నిరుపేదలను అడ్డుపెట్టుకొని రియల్టర్లు, బిల్డర్లు చెరువు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో స్థలాలు కొనుగోలు చేసే ముందు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే బఫర్ జోన్‌లో నిర్మించిన ఇళ్లకు భవిష్యత్‌లో ప్రమాదం తప్పదని ఆయన హెచ్చరించారు.
రంగంలోకి 72 బృందాలు : జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఓఆర్ఆర్ వరకు 2 వేల 50 చదరపు కిలోమీటర్ల పరిధి వరకు హైడ్రా పరిధి విస్తరించి ఉందని, ఇందుకోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్‌తో పాటు ఎస్పీ ర్యాంకు అధికారి పని చేస్తారని రంగనాథ్ తెలిపారు. కబ్జాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించడంతో పాటు క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు 72 బృందాలను రంగంలోకి దింపనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని రాగానే, ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.
ప్రజల సహకారం కావాలి : ఇటీవల నందగిరి హిల్స్ పార్క్ స్థలంపై హైడ్రాపై కొంత మంది నాయకులు ఆరోపణలు చేశారని, అవేవీ పట్టించుకోకుండా ప్రజలకు మెరుగైన జీవనం ఉండేలా హైడ్రా పని చేస్తుందని రంగనాథ్ తెలిపారు. పార్క్ స్థలాన్ని పరిరక్షించేందుకు కాలనీవాసులు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారే స్వయంగా ఫెన్సింగ్ వేయడాన్ని సమర్థిస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణలపై ప్రజలు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
హైడ్రా విధివిధానాలు ఖరారు - ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు - HYDRA for Disaster Management