Victims Fight with Hydra Officers : హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులతో బాధితులు వాదనకు దిగుతున్నారు. మాదాపూర్ సున్నం చెరువు వద్ద కూల్చివేతలను అడ్డుకోవడానికి యత్నించారు. ఓ స్థానికురాలు ఒంటిపై పెట్రోల్ పోసుకోగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఇళ్లల్లో, గోదాంలలో ఉన్న వస్తువులను తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు.
బాధితుల వాగ్వాదం : మాదాపూర్ సున్నం చెరువు బఫర్ జోన్‌లో ఉన్న వ్యాపార షెడ్లను సైతం హైడ్రా తొలగించింది. చిన్నచిన్న షాపులు, హోటళ్లు కూల్చింది. ముందస్తు నోటీసులు లేకుండా పడగొడుతున్నారని స్థానికులు ఆరోపించారు. దుండిగల్ మల్లంపేట కత్వా చెరువు పరిధిలో మార్క్ చేసిన విల్లాల్లో ఉన్నవారిని ఖాళీ చేయిస్తున్న సిబ్బందితో బాధితులు వాగ్వాదానికి దిగారు. కొనే ముందు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న విషయం తమకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే నిర్మాణాలు నేలమట్టం : సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో హైడ్రా మరోసారి బుల్డోజర్ను రంగంలోకి దింపింది. సంగారెడ్డి పెద్దచెరువు సమీపంలోని వాణి నగర్, హెచ్ఎంటీ కాలనీల్లోని చెరువు పరిధిలోని సర్వే నంబర్ 323, 324, 325 లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రాధికారులు, మున్సిపాలిటీ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేశారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్చెరు పర్యటన చేపట్టిన వారం రోజుల తర్వాత కూల్చివేతలకు హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో వెలసిన ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేశారు. హైడ్రా ఆదేశాల మేరకే ప్రభుత్వ స్థలాల్లో, చెరువులు, కుంటల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చి వేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
"మేము అధికారుల అనుమతితోనే నిర్మాణాలు చేసుకున్నాం. ఇవాళ హఠాత్తుగా వచ్చి మార్కు చేసి, ఎటువంటి గడువు ఇవ్వకుండా ఉన్నపళంగా కూల్చివేస్తున్నారు. పెద్దవారికి గడువు ఇస్తున్నారు. మమ్మల్ని రోడ్డున పాడేశారు. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి". - బాధితులు
హైడ్రా దూకుడు - ఒకే రోజు మూడుచోట్ల అక్రమ నిర్మాణాల కూల్చివేత - hydra demolish illegal assets