Ganesh Idol Installation Instructions in Hyderabad : చిన్నాపెద్దా తేడా లేకుండా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్న గణేశ్‌పండుగకు సమయం ఆసన్నమైంది. వచ్చే నెల సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభమైన నాటి నుంచి 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఇలా ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే సెప్టెంబర్ 17న మహా నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో వినాయకచవితి ఉత్సవాల నిర్వహణకు నగర పోలీసులు మార్గదర్శకాలను జారీచేశారు.
అనుమతి తప్పనిసరి : గణేశ్ మండపాల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకు అన్ని నిబంధనలను పాటించడంతో పాటు, ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అందరూ సహకరించాలంటూ ఆయన పలు సూచనలు చేశారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నిర్వాహకులు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు నగర పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సీపీ స్పష్టం చేశారు.
దరఖాస్తులపై సమీక్ష : ఇందుకోసం వచ్చేనెల 6వ తేదీ లోపు హైదరాబాద్ పోలీస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులపై పోలీసులు సమీక్ష నిర్వహించి అనుమతులు మంజూరు చేస్తారు. ఏ ప్రదేశంలో వినాయక మండపం ఏర్పాటు చేస్తారు? ఎప్పుడు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? ఏ దారి గుండా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది? అనే పూర్తి వివరాలు దరఖాస్తులో పొందుపర్చాల్సి ఉంటుంది.
ఎన్వోసీ సర్టిఫికెట్ : గణేశ్ మండపాలు ఏర్పాటు చేసేందుకు ఎంచుకున్న స్థలానికి సంబంధించిన యజమానుల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని సీపీ తెలిపారు. వివాదాస్పద ప్రదేశాలతో పాటు యజమానులు అనుమతించకపోయినా ఆయా ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేయకూడదని తేల్చిచెప్పారు. సెల్లార్లు, కాంప్లెక్సుల్లో నిర్వహించే ఉత్సవాలకు కూడా పోలీసుల అనుమతులు తప్పనిసరి. అలాగే మండపాలకు సంబంధించి కరెంట్ కోసం విద్యుత్‌శాఖ నుంచి తప్పని సరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
గణేశ్ మండపాల వద్ద 2 స్పీకర్ బాక్సులకు మించి వాడకూడదని పోలీసులు తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ స్పీకర్ బాక్సుల వినియోగంపై నిషేధం విధించారు. మండపాల వద్ద వాలంటీర్లు బ్యాడ్జీలు ధరించి, భద్రతతో పాటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించాలి. అగ్నిప్రమాదాలు జరగకుండా ముందుస్తు చర్యలతో పాటు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలి. ఇందుకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే తమ తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని, లేదా 8712665785 నెంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.