Fraudulent IAS Officer Arrested In Telangana : ఐఏఎస్ అధికారిని అంటూ నమ్మించి పెళ్లిచేసుకున్న ఓ వ్యక్తి భార్య తరపు ఆస్తిపై కన్నేశాడు. ఆదాయ పన్ను అధికారులు బ్యాంక్ ఖాతా సీజ్ చేశారని భార్యను నమ్మించాడు. అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయంటూ ఆమె వద్ద నుంచి రూ.2 కోట్లు వసూలు చేశాడు. ఆపై అదనపు కట్నం తీసుకురమ్మని కట్టుకున్న భార్యను వేధింపులకు గురిచేశాడు. సహనం నశించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడితోపాటు అతడి తల్లిదండ్రులను అరెస్టు చేసిన ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి పరిధిలో చోటుచేసుకుంది.
బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్‌కుమార్ (38) 2016లో కర్ణాటక ఐఏఎస్ క్యాడర్‌లో ఎంపికైనట్లు ఊరంతా గొప్పలు చెప్పుకొన్నాడు. ఐఏఎస్‌ను అంటూ ఓ మ్యాట్రీమోనీలో వివరాలు ఉంచాడు. ఆ వివరాలను చూసి, బెల్జియంలో ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అరిమిల్లి శ్రావణి (34) కుటుంబీకులు అతడిని సంప్రదించారు. రూ. 50 లక్షల కట్నంతో పాటుగా ఇతర లాంఛనాలు ఇచ్చి 2018లో వివాహం చేశారు. తనకు ఐఏఎస్ అధికారిగా పనిచేయడం ఇష్టం లేదని భార్యను నమ్మించాడు. రేడియాలజిస్టుగా ఉద్యోగం చేస్తానని ఆమెకు చెప్పి నిత్యం విధులకు వెళ్లి వస్తున్నట్లు నమ్మించాడు.
ఉద్యోగాల పేరుతో పైసా వసూల్- బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ
ప్రస్తుతం ఈ కుటుంబం మల్లంపేట గ్రీన్‌వాలీ రోడ్డులో ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇన్ని సంవత్సరాల సంపాదనంతా ఏదని భార్య నిలదీసింది. దీంతో తాను వైద్యం ద్వారా రూ. 40 కోట్లు ఆర్జించానని ఆదాయపన్ను చెల్లించకపోవడంతో అధికారులు బ్యాంకు ఖాతాను సీజ్ చేశారని భార్యను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ డబ్బులు రావాలంటే రూ. 2 కోట్లు చెల్లించాలని భార్యను నమ్మించాడు. శ్రావణి మిత్రుల ద్వారా ఆ డబ్బులు సమకూర్చింది. ఆ డబ్బును సందీప్‌కుమార్ తన తండ్రి విజయ్‌కుమార్ (70), అమెరికాలో ఉంటున్న సోదరి మోతుకూరి లక్ష్మీసాహితి (35) ఖాతాలకు బదిలీ చేశాడు.
ఇక వివాహ సమయంలో ఇచ్చిన ఆభరణాలను తల్లి మాలతి (59) బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకుంది. భర్త ఐఏఎస్ ధ్రువపత్రంతోపాటు రేడియాలజీ సర్టిఫికెట్ నకిలీవని శ్రావణి గుర్తించింది. ఇంత జరిగినప్పటికీ శ్రావణిని అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధిస్తుండడంతో ఆమె బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడితోపాటు అతడి తల్లిదండ్రులను బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. మరో నిందితురాలు లక్ష్మీసాహితీ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. వారిని సైతం త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పేర్కొన్నారు.