Police Crack Down on Fake Gold Scam in Hyderabad : బంగారం పేరుతో వ్యాపారులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా నకిలీ బంగారంతో వ్యాపారస్తులను మోసం చేస్తున్న ముఠాను మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ బంగారంతో పాటుగా భారీ మెుత్తంలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది.
గత కొంత కాలంగా బంగారం పేరుతో వ్యాపారులకు టోకరా వేస్తూ కోట్లు కొల్లగొడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6.86 కోట్ల నకిలీ నోట్లు, 5కిలోల నకిలీ బంగారం బిస్కెట్లు, రూ.51 లక్షల నగదుతో పాటుగా మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి రాచకొండ సీపీ తరుణ్‌జోషి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు.
బోడుప్పల్‌కు చెందిన వ్యాపారి దిలీప్ బర్ఫా తన మిత్రుడు సింగిరెడ్డి సురేశ్‌తో కలిసి మే 19న బెంగళూరులో విజయ్, సునీల్‌ను కలిశారు. మెుదట బర్ఫాను నమ్మించేందుకు 101 గ్రాముల అసలు బంగారాన్ని కేవలం రూ.6 లక్షలకే విక్రయించారు. దీంతో బర్ఫాకు నమ్మకం కలిగి రెండు కిలోల బంగారం కావాలని చెప్పగా రూ.1.1 కోట్లకు ఇస్తామని నిందితులు చెప్పారు. బర్ఫా రూ.20 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చాడు. మే 29న సురేశ్, బర్ఫా ఇద్దరూ మరోసారి బెంగళూరుకు వెళ్లారు. విజయ్ వాళ్ల కళ్లముందే 5 కిలోల బంగారం అమ్మి, రూ.కోట్లలో డబ్బు తీసుకుంటున్నట్లు నటించాడు. తర్వాత బర్ఫా రూ.90లక్షలు ఇవ్వగా నిందితులు నకిలీ బంగారం ఇచ్చారు. తిరిగి వస్తుండగా సాయి కిరిటీ నకిలీ పోలీసులా వచ్చి బంగారం స్వాధీనం చేసుకుని వెళ్లిపోయాడు. బాధితుడు మేడిపల్లి పోలీసుల్ని ఆశ్రయించాడు. నిందితుల కదలికలపై నిఘా ఉంచిన మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ గోవిందరెడ్డి, ఎస్సై నర్సింగరావు కీసరలో నలుగురిని ఒకేసారి అరెస్టు చేశారు.
బీటెక్ చదివి చోరీలకు పాల్పడుతూ: ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి కంచరమెట్ట గ్రామానికి చెందిన కర్రెద్దుల విజయ్‌కుమార్ అలియాస్ (కృష్ణమోహన్) 39 బీటెక్ పూర్తి చేశాడు. గత కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడ్డ విజయ్, సమీప గ్రామంలో నకిలీ బంగారం పేరుతో మోసం చేసే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం తాను కూాడా నకిలీ బంగారం తయారు చేయడం నేర్చుకున్నాడు. విజయ్‌కి నెల్లూరు కావలికి చెందిన బోగిరి సునీల్ గవాస్కర్ అలియాస్ హరీశ్(26), అడిగోపుల ఓం సాయి కిరీటి(26) గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నంబూరి డేవిడ్ లివింగ్ స్టోన్ అలియాస్ సెంథిల్(52) పరిచయమయ్యారు. ఈ నలుగురూ బెంగళూరు కేంద్రంగా ఉంటూ, ఏపీ, తెలంగాణలో మోసాలకు పాల్పడుతున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు విజయ్‌పై 13 కేసులున్నాయి. 2010 నుంచి మోసాలు చేస్తున్నాడు. నాలుగు కేసుల్లో పరారీలో ఉన్నాడు. డేవిడ్ మీద రెండు కేసులున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం - 8 ఇళ్లల్లో భారీగా బంగారంతో పాటు రూ.17 లక్షల నగదు అపహరణ