CP CV Anand On DJ Sound Pollution : మతపరమైన ర్యాలీల్లో డీజేలు, టపాసుల వాడకంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్, రాచకొండ పోలీసు అధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు వివిధ పార్టీల ప్రతినిధులు మత సంఘాల నేతలు హాజరయ్యారు.
డీజే శబ్దాలపై మాకు ఫిర్యాదులు వస్తున్నాయి : డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని నివాసాల్లో వయసు మీరిన వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని సీపీ తెలిపారు. డీజే సౌండ్‌బాక్స్‌లను కట్టడి చేయాలని తమకు అనేక సంఘాల నుంచి వినతులు ఇచ్చారని, అందుకే పలు వర్గాలను పిలిచి సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. అందరి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. నివేదికపై సర్కారు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
CV Anand On DJ Sounds Impact On Health : డీజే సౌండ్ పొల్యుషన్‌పై కంట్రోల్ చేయకపోతే ఆరోగ్యాలు దెబ్బతింటాయని సీవీ ఆనంద్ వివరించారు. గుండె అదురుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని సమావేశంలో వివరించారు. డీజే శబ్దాలు శృతి మించిందని సీవీ ఆనంద్ అన్నారు. గణేశ్ పండుగతో పాటు మిలాద్ ఉన్ నబిలో డీజే నృత్యాలు విపరీతంగా వినియోగించారన్నారు. పబ్‌లో డ్యాన్సులు చేసినట్లే ర్యాలీల్లో చేస్తున్నారని తెలిపారు. కాగా డీజేల వాడకం విషయంలో త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని గతంలో డీజీపీ ప్రకటించిన నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. డీజేలపై ఏం నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.
"డీజే శబ్దాలపై హైదరాబాద్ సీటీ పోలీస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ మధ్య జరిగిన గణేశ్ ఉత్సవాలు, మిలాద్ పండుగలు, వినాయక నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా డీజేల విషయమై ప్రజల నుంచి మాకు ఫిర్యాదులు అందాయి. డీజే సౌండ్ల వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, పెద్దవారు సమస్యలు ఎదుర్కొంటున్నారని కంప్లైంట్‌లు వచ్చాయి. డీజేలు పెట్టిన ప్రాంతంలో నడుస్తున్నప్పుడు శరీరమంతా వణుకుతుంది. చెవులు ఎప్పుడు పలుగుతాయో అని భయం ఏర్పడింది. డీజేలు పెట్టి శబ్దకాలుష్యం ఉల్లంఘనలు జరగుతున్నాయి"- సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
హుస్సేన్‌సాగర్‌లో 5,500 విగ్రహాలు నిమజ్జనం : సీపీ సీవీ ఆనంద్ - CP Anand On Ganesh Immersion