Lokesh Praja Darbar 33rd Day : ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు భారీగా స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారుజామునుంచే ఆయణ్ని కలిసేందుకు జనం బారులు తీరుతున్నారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ 33వ రోజు లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహించారు.
ప్రజల నుంచి పెద్దఎత్తున వినతులు : ఈ సందర్భంగా ప్రజల నుంచి పెద్దఎత్తున వినతులు వెల్లువెత్తాయి. ఏలూరు జిల్లా చొప్పరామన్నగూడెంలోని చర్చి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బాధితులు లోకేశ్‌కు మొరపెట్టుకున్నారు. ఎలాగైనా స్థలాన్ని కాపాడాలని మంత్రిని కోరారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమారుడికి వైద్యం సాయం అందించాలని ఓ కుటుంబం లోకేశ్‌కు విజ్ఞప్తి చేసింది. తన కుమార్తె మానసిక వికలాంగురాలని తనకు పింఛన్ ఇప్పించాలని ప్రొద్దుటూరుకు చెందిన ఓ మహిళ లోకేశ్‌ను కోరింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న విష్టుసారథి సొసైటీ డ్రైవర్లకు గత ప్రభుత్వం పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించకుండా అన్యాయం చేసిందని వారు వాపోయారు. ఈ విషయాన్ని లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా లడ్డూ, గుర్తింపుకార్డులు కూడా ఇవ్వకుండా కాలయాపన చేశారని తెలిపారు. తమను రెగ్యులరైజ్ చేసి ఆదుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారికి లోకేశ్ భరోసా ఇచ్చారు
Huge Response to Lokesh Praja Darbar : ఎన్టీఆర్ జిల్లా కవులూరుకు చెందిన చిన్న, సన్నకారు రైతులు మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. బుడమేరు కాలువ మీద ఉన్న తొమ్మడ్ర వాగుకు 2,000ల క్యూసెక్కుల సామర్థ్యం ఉందని వారు ఆయనకు వివరించారు. అయితే వర్షాకాలంలో వాగునీరు పొంగి పొలాలపైకి ప్రవహించడం వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తొమ్మడ్ర వాగును నైఫన్ నుంచి తారకరామా వరకు కాలువ నిర్మించి వరదను నివారించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి నుంచి విన్నపాలు స్వీకరించిన లోకేశ్ వాటి పరిష్కరానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
21వ రోజు మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ - సమస్యల సత్వర పరిష్కారానికి భరోసా - Nara Lokesh Praja Darbar