Huge Loss To Vijayawada Iron Yard : విజయవాడ భవానీపురంలో సుమారు 60 ఎకరాల్లో విస్తరించిన 'ఐరన్ యార్డ్' ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందింది. ఇక్కడ 430 వరకూ హోల్‌సేల్ వ్యాపార దుకాణాలు ఉన్నాయి. అత్యధికంగా 250 ఐరన్ షాపులున్నాయి ప్లైవుడ్, శానిటరీ, పైపులు, ఆగ్రో, కెమికల్, నిత్యావసర వస్తువుల ప్యాకింగ్, ట్రాన్స్‌పోర్ట్స్, పేపర్, ఎలక్ట్రికల్స్, హార్డ్‌వేర్ దుకాణాలు కూడా వందల్లోనే ఉన్నాయి. ఈనె 1న యార్డ్‌ను వరద చుట్టుముట్టింది. 3 నుంచి 6 అడుగుల మేర నిలిచింది. కొన్ని దుకాణాల్లో ఇంకా నీరు నిల్వ ఉండగా కొంత సామగ్రిని వెలుపలికి తెచ్చి ఉంచారు. తడిసిన హార్డ్‌వేర్ మొత్తం రంగు మారింది.
విజయవాడలోని వరద నీటితో ‘ఐరన్ యార్డ్’లో క్రయ, విక్రయాలు స్తంభించాయి. విశాఖ, హైదరాబాద్, రావులపాలెం, కోల్‌కతా, రాయపూర్ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇనుప సామగ్రిని ఇక్కడి హోల్‌సేల్ వ్యాపారులు రాష్ట్రంలోని రిటైల్ వర్తకులకు టన్నుల చొప్పున విక్రయిస్తుంటారు. ఇప్పుడు రంగుమారిన ఇనుప సామాగ్రిని అయినకాడికి అమ్ముకోవడం మినహా మరోదారి లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొర్రీలు వద్దు - కనికరం చూపండి - బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులకు చంద్రబాబు ఆదేశాలు - Chandrababu Meeting With Bankers
ఒక్కో హోల్‌సేల్ వ్యాపారి వద్ద 100 టన్నుల నుంచి 700 టన్నుల వరకు ఇనుప సామగ్రి ఎప్పుడూ ఉంటోంది. ఈ ఐరన్ యార్డ్ మొత్తంగా రోజూ 4 నుంచి 5 కోట్ల వరకూ వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు 15 రోజులుగా వ్యాపారం అటకెక్కింది. బ్యాంకుల నుంచి ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇప్పించాలని వ్యాపారులు కోరుతున్నారు.
సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఐరన్ యార్డ్‌లో మురుగునీటి కాల్వలు అసలు లేవు. ఇక్కడికి బుడమేర 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. యార్డులోనికి వచ్చి నీరు కాల్వలు లేనందున నేరుగా దుకాణాల్లోనికి వెళ్లింది. దుకాణాల్లోని సామగ్రి పూర్తిగా నేలపైనే ఉన్నందున..అవి తడిచి, తుప్పుబట్టాయి. మురుగు నీటి కాల్వల నిర్మాణానికి 4 కోట్లు ఖర్చు అవుతుందని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అంచనాలు సిద్ధం చేసినా అంతకుముందు చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగలేదు. ఫలితంగా కాల్వల నిర్మాణ పనులు స్తంభించాయి.