Huge Land Kabza YSRCP Leaders in Tirupati District : ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వైసీపీ నేతల భూ కబ్జాల పర్వం కొనసాగుతోంది. మొన్నటిదాకా నకిలీ పట్టాలతో ప్రజల స్థలాలను ఆక్రమించేసిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఏకంగా తిరుపతి నగరాభివృద్ధి సంస్థ- తుడా భూమికే ఎసరు పెట్టారు. రూ.25 కోట్ల విలువైన స్థలాన్ని కొట్టేసేందుకు సరికొత్త ఎత్తులు వేశారు. ప్రజల విశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమణకు పావులు కదుపుతున్నారు. కొద్దిరోజుల క్రితం తుడా భూమిలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసిన అక్రమార్కులు ఇప్పుడు దాని చుట్టూ గుడి కట్టి భక్తి ముసుగులో స్థలం మొత్తాన్ని దోచుకునేందుకు సిద్ధమయ్యారు.
భూ యాజమాన్య హక్కులు కల్పించడంలో జగన్ సర్కార్ జాప్యం వెనుక కారణమేంటీ?
అధికార పార్టీ నేతల భూదాహానికి అంతే లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించేందుకు నక్కజిత్తుల ప్రణాళికలు వేస్తున్నారు. తిరుపతి- కరకంబాడి ప్రధాన మార్గాన్ని అనుకుని మంగళంలో ఉన్న రూ.25 కోట్ల విలువైన రెండు ఎకరాల తుడా భూమిపై వైసీపీ నేతలు కన్నేశారు. సాధారణంగా ఆక్రమిస్తే ఇబ్బందులు వస్తాయని భావించి తమ అక్రమాలకు భక్తి ముసుగు తొడిగారు. తొలుత చిన్నపాటి దిమ్మె నిర్మించి దానిపై విఘ్నేశ్వరుడి ప్రతిమను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విగ్రహం చుట్టూ గుడి నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే గుడి ఉన్నా తాజాగా వినాయకుడ్ని ప్రతిష్టించి మరో ఆలయ నిర్మాణానికి వైసీపీ నేతలు తెరతీశారు. 2 నెలల కిందటి వరకు కుండీలు, చెట్లతో నిండుగా ఉన్న తుడా భూమిని బోడిగా మార్చేశారు. కబ్జాకు వీలుగా చదును చేసి ఆలయ నిర్మాణానికి పరదాలు కట్టారు.
దొరికినంత దోచుకో - పంచుకో - విశాఖలో వైఎస్సార్సీపీ నేతల భూకబ్జాలు
ఆక్రమణ విషయం బయటకు పొక్కకుండా తెరలు కట్టి జాగ్రత్త పడిన కబ్జారాయుళ్లు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తుడా భూమి చుట్టూ కంచె వేయడానికి తవ్వకాలు చేపట్టారు. భూ కబ్జాపై అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ వారిని నిలువరించకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీకి చెందిన పెద్దస్థాయి నేతల అండతోనే అధికారులు నోరు మెదపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే అధికార యంత్రాంగం మొత్తం బిజీగా ఉన్న సమయంలో భూమి తమ అధీనంలోకి వస్తుందని వైసీపీ నేతలు పన్నాగం పన్నారు.
సాగు హక్కు కల్పించాలని అనకాపల్లి గిరిజనుల ఆందోళన
తుడా భూములు వైసీపీ పెద్దల కబంద హస్తాల్లో చిక్కుకున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన స్థలం అన్యాక్రాంతం కాకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.