Huge Arrangements for Chandrababu Oath Taking Ceremony: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే ఉండే ఈ ప్రదేశంలో ఈ నెల 12న ఉదయం 11 గంటల 27నిమిషాలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతుండడంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు ప్రత్యేక గ్యాలరీలు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీఐపీ+, మరో మూడు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాలను నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల ఐదు ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు.
రెయిన్ ఫ్రూఫ్ షెడ్లు ఏర్పాటు: భారీ వర్షాలు పడినా ప్రమాణస్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్టమైన రెయిన్ ఫ్రూఫ్ షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ+ గ్యాలరీ ఉంటుంది. మిగిలిన 11.5ఎకరాల్లో వీఐపీ, నేతలు, ప్రజలకు నాలుగు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. భారీ విద్యుత్తు దీపాలతో పాటు సభ జరిగే సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
ఇక అమరావతికి కొత్త కళ - యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు - CRDA Started Work in Capital
ప్రముఖుల రాకకు ప్రత్యేక ఏర్పాట్లు: విమానాశ్రయానికి అభిముఖంగానే సభా వేదిక ఉండటంతో హెలీప్యాడ్‌ల అవసరం లేదు. నేరుగా ప్రముఖులు సభా ప్రాంగణానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. విమానాశ్రయం ప్రధాన గేట్ నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణం వద్దకు ప్రధాని నరేంద్రమోదీ, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖుల రాకకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం ప్రహరీని ఆనుకొని ఉన్న కేసరపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వెనుక భాగంలో వీవీఐపీ వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేకంగా అప్రోచ్ రహదారులను సిద్ధం చేస్తున్నారు.
ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్‌లు: ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అధికారులుగా నియమించిన ఐఏఎస్‌లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల ఉన్నతాధికారుల సమన్వయంతో పర్యవేక్షణ బృందం దగ్గరుండి ఏర్పాట్లను చేయిస్తోంది. పనుల్లో వేగం పెంచాలని ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా పటిష్టంగా చేపట్టాలని సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ అధికారులకు సూచించారు. పార్కింగ్ స్థలాలు, ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. వైద్య శిబిరాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను పెద్దసంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
10 వేల మంది పోలీసులతో బందోబస్తు: గుంటూరు, ఏలూరు రేంజ్‌లు, విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులు, సిబ్బంది సహా దాదాపు 10 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్-ఎస్పీజీ బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖుల కోసం విజయవాడ నగరంలోని పెద్ద హోటళ్లలోని గదులన్నింటినీ ప్రభుత్వం బుక్ చేసింది. ఈనెల 11, 12 తేదీల కోసం ముందుగానే ప్రభుత్వ సాధారణ పరిఫాలన శాఖ ఆధ్వర్యంలో గదులను బుక్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రామోజీరావుకు కన్నీటి వీడ్కోలు - Tribute to Ramoji Rao in across AP