HUDCO Loan For Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ఆర్ధిక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఏపీ సీఆర్డీఏకు రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) అంగీకారం తెలియచేసింది. దిల్లీ పర్యటనలో ఉన్న పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ హడ్కో సీఎండీతో నిర్వహించిన భేటీలో హడ్కో ఆమోదాన్ని తెలియచేసింది.
11 వేల కోట్ల రూపాయలు రుణం: రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో (Housing And Urban Development Corporation Limited) ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణకు ఈ అంశాన్ని ఆ సంస్థ సీఎండీ వెల్లడించారు. దిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ ఆ సంస్థ ఎండీ సంజయ్ కుల్ శ్రేష్టతో భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను వివరించారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ సీఆర్డీఏకు 11 వేల కోట్ల రూపాయలు రుణంగా ఇచ్చేందుకు అంగీకారాన్ని తెలియచేసింది.
అమరావతి ఐకానిక్ నిర్మాణాలకు త్వరలోనే టెండర్లు - డిజైన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రపంచ బ్యాంకు సైతం: ఇప్పటికే అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు కూడా అంగీకారాన్ని తెలియచేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏతో కుదుర్చుకోనున్నారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతిలో ప్రభుత్వ భవనాల కాంప్లెక్సులు, అసెంబ్లీ, సచివాలయ టవర్లు, రాజ్ భవన్, హైకోర్టు తదితర ప్రాజెక్టులను నిర్మించాల్సి ఉంది.
మొదటి విడతకు రూ.26 వేల కోట్లు: దీంతో పాటు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతులను కల్పించాల్సి ఉంది. అలాగే రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయం లాంటి ట్రంక్ ఇన్ఫాస్ట్రక్చర్ను చేపట్టాల్సి ఉంది. ఈ పనులకు దాదాపు రూ.50 వేల కోట్ల రూపాయల వరకూ వ్యయం అవుతుందని అంచనా. అయితే మొదటి విడతగా రూ.26 వేల కోట్ల రూపాయల మేర వ్యయం చేయాల్సి వస్తుందని సీఆర్డీఏ భావిస్తోంది. ఈ నిధుల సమీకరణపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది.
అమరావతి పనులు ఇక మరింత వేగంగా: కేంద్ర ప్రభుత్వం హామీదారుగా ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుల ద్వారా రూ.15 వేల కోట్ల రూపాయల రుణాన్ని రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం వినియోగించనున్నారు. ఇక మిగిలిన రూ.11 వేల కోట్ల నిధుల మంజూరుకు హడ్కో అంగీకారాన్ని తెలియచేసింది. రుణ మంజూరుకు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు సంతృప్తి చెందిన హడ్కో రూ. 11 వేల కోట్ల రుణం మంజూరుకు ఆమోదాన్ని తెలియచేసింది. ఈ నిధులు విడుదల కాగానే డిసెంబరు నుంచి అమరావతి రాజధాని పరిధిలో పనులు వేగం పుంజుకోనున్నాయి.
అమరావతికి రూ.15000 కోట్లు- పూర్తి బాధ్యత కేంద్రానిదే! - World Bank Loan to Amaravati