How To Overcome From Forgetfulness : రోజూ మనం కలిసి మాట్లాడే ఫ్రెండ్స్ అయినా ఉన్నట్టుండి ఒక్కోసారి తన పేరు వెంటనే గుర్తు రాదు. ఇష్టమైన సినిమాని ఎన్నో సార్లు చూస్తుంటాం. అయినా ఆ మూవీ హీరోయిన్ పేరు అడిగితే టక్కున చెప్పలేకపోతాం. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటికి వేసిన తాళం చెవి ఎక్కడ పెట్టామో కూడా గుర్తు రాదు. చాలామందికి ఇలాంటి పరిస్థితి ఏదో ఒక టైమ్‌లో ఎదురవుతుంది. ఇలా చిన్న చిన్న విషయాలను సైతం మరచిపోవడానికి వృత్తిపరమైన టెన్షన్స్, ఒత్తిడి వంటివి కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఇలాంటి మతిమరుపును దూరం చేసుకోవాలంటే రోజువారీ లైఫ్స్టైల్లో కొన్ని అంశాల్ని తప్పకుండా అలవాటుగా మార్చుకోవాలంటున్నారు.
పజిల్స్‌తో పదును!
డైలీ న్యూస్ పేపర్ చదవడం చాలామందికి ఉండే అలవాటు. అయితే చాలా పత్రికల్లో సుడోకు, పజిల్స్, పొడుపు కథలు, లాజిక్‌తో ముడిపడి ఉండే చిక్కు ప్రశ్నలు, వంటివి కూడా ప్రచురిస్తారు. కానీ ఇవన్నీ పిల్లల కోసమనో లేదంటే అంతగా ఆలోచించే ఓపిక లేదనో వాటిని పట్టించుకోరు చాలామంది. కానీ ఈ పజిల్స్ పూర్తి చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ చాలా చురుకుగా పనిచేస్తుంది. ఎక్కడ ఏ పదం సరిగ్గా నింపామో కూడా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే రోజూ ఏదో ఒక టైంలో వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మతిమరుపును దూరం చేసుకొని జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.
మెమరీ పవర్‌కూ యోగా..
మతిమరుపుకి మరో ముఖ్య కారణం తీవ్రమైన ఒత్తిడి. ఆఫీసులో పని భారం ఎక్కువగా ఉన్నా లేదంటే ఏ పనైనా సరిగ్గా పూర్తికాకపోయినా, ఏక కాలంలో ఒకటి కంటే ఎక్కువ పనులు చేయాల్సి వచ్చినా, మన మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఈ క్రమంలో చాలా విషయాల్లో మనకు తెలియకుండానే మతిమరుపు దరిచేరుతుంది. దీనికి యోగా చక్కటి పరిష్కారం అంటున్నారు ఎక్స్పర్ట్స్. యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఫలితంగా మనలో ఒత్తిడి క్రమక్రమంగా తగ్గిపోతుంది. దీంతో పాటు మెడిటేషన్ కూడా ఒత్తిడిని దూరం చేసి ఏకాగ్రతను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
తగినంత నిద్ర తప్పనిసరి..
నిద్ర మెదడుకు పూర్తి విశ్రాంతిని ఇస్తుంది. అందుకే సరిపడినంత సేపు నిద్రపోకపోతే మెదడు పనితీరు క్షీణిస్తుంది. ఫలితంగా టైంకు ఏమీ గుర్తు రావు. అలాగే బ్రెయిన్ కూడా ఒత్తిడికి గురవుతుంటుంది. కాబట్టి రోజూ ఏడెనిమిది గంటలు కచ్చితంగా నిద్రకు కేటాయించాలి. దీనివల్ల మార్నింగ్ లేవగానే మనసుకు ఉల్లాసంగా, శరీరానికి ఉత్సాహంగా అనిపిస్తుంది. బద్ధకం దూరమై మెదడుకూ ప్రశాంతతంగా ఉంటుంది. ఇవన్నీ మతిమరుపును దూరం చేసేవే! అంతేకాదు, ఉదయాన్నే నిద్ర లేచే వారిలోనూ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుందని పలు అధ్యయనాల్లోనూ వెల్లడైంది.
రివర్స్ చేద్దాం..
మీరు చేతికి వాచీ (గడియారం) ఎలా పెట్టుకుంటారు? ‘టైం చూడటానికి వీలుగా’ అంటారా? అయితే ఈసారి అలా కాకుండా వాచీని రివర్స్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది మన మెమోరీ పవర్‌ను పెంచుతుందట. తిరగేసి వాచీ పెట్టుకున్నప్పుడు మొదట్లో టైం తెలుసుకోవడానికి కాస్త ఇబ్బంది పడతాం. కానీ అలవాటయ్యే కొద్దీ సమయం చూడడం చాలా సులభమవుతుంది. అంటే ఏ దిశలో వాచీ పెట్టుకున్నా టైంను గుర్తించగలిగే సామర్థ్యం మెదడుకు అలవడుతుంది. తద్వారా బ్రెయిన్ చురుకుదనం పెరుగుతుంది. వీటితో పాటు రోజూ వ్యాయామం చేయడం, కాఫీ, టీలకు దూరంగా ఉండడం, క్రియేటివిటీని పెంచుకోవడం వంటి హేబిట్స్ వల్ల కూడా మెదడు చురుకై, మతిమరుపు సమస్య దూరమవుతుందంటున్నారు నిపుణులు.
ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి మీ కోసం ఈ 'వారం'- మీరు ట్రై చేయండి - Good Habits For A Healthy Week
నోటి ఆరోగ్యం కోసం ఆయిల్ పుల్లింగ్- మీరు ట్రై చేయండి! - Oil Pulling Health Benefits