AP TDP Leader Pattabhi Ram On TTD Laddu : ఏపీ జగన్ పాలనలో టీటీడీ సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని తెలిపారు. ఏఆర్ సంస్థ ఉత్పత్తి చేసే నెయ్యి నెలకు కేవలం 16 టన్నులు మాత్రమేనని టీటీడీ టెక్నికల్ కమిటీ నిర్ధారించిందన్నారు. ఇలాంటి కంపెనీ నెలకు 1000 టన్నులు ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు.
శ్రీవారి ప్రసాదాలకు వాడే నెయ్యిలో కూడా వైసీపీ నేతలు దోపిడీ చేసేందుకు ఏఆర్ ఫుడ్స్ డెయిరీ అడ్డుపెట్టుకున్నారని ఆధారాలు నిరూపిస్తున్నాయని పట్టాభి ధ్వజమెత్తారు. ‘సత్యమేవ జయతే’ అని చెబుతున్న జగన్ తాము చూపించే ఆధారాలను ప్రజలకు చూపించగలరా? అని ప్రశ్నించారు. రూ.39 కోట్ల నెయ్యి కాంట్రాక్టులో వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, వాళ్లకు మద్దతు పలికే అధికారులు పాపాలు చేశారని పట్టాభి ఆరోపించారు.
తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సుప్రీంకోర్టు : మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం విచారణ జరపనుంది. శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణకు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ కోరగా, అందుకు జస్టిస్ గవాయ్ ధర్మాసనం అంగీకరించింది. సుప్రీం ధర్మాసనం మరో కేసు విచారణలో తీరిక లేకుండా ఉండటం వల్ల, ఈ కేసు ఇవాళ విచారణకు రాలేదు. మరో కేసు విచారణ ఆపి మరీ లడ్డూ కేసు విచారించడం భావ్యం కాదన్న సొలిసిటర్ జనరల్ సూచనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
కాగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా నలుగురు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బి.ఆర్.గవాయ్, కె.వి.విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సరిపోతుందా లేదా కేంద్రం నుంచి ఎవరినైనా నియమించాలనే విషయంపై కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. దీనికి సొలిసిటర్ జనరల్ కొంత సమయం కోరడంతో తదుపరి విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అయితే నేడు ధర్మాసనం మరో కేసులో బిజీగా ఉన్నందున శుక్రవారం ఉదయం విచారణ జరగనుంది.
తిరుపతి లడ్డూ నాణ్యత పునరుద్ధరించిన టీటీడీ - ఇక నో టెన్షన్ - TTD Laddu Updates