Rising Honey Trap Cases Visakha : తొలుత యువకులకు ఫోన్ చేస్తారు తీయగా మాట్లాడతారు! పరిచయం పెంచుకుంటారు. అలా ఫొటోలు పంపిస్తారు! ప్రేమ పేరుతో దగ్గరవుతారు. ఆపై జంటగా ఉంటారు!! అంతే ఇక ఆ యువతుల వలలో యువకులు చిక్కినట్లే!! జంటగా ఉన్న చిత్రాలతో బెదిరిస్తారు! అడిగినంత ఇవ్వకపోతే ముఠాతో దాడి చేయిస్తారు. ఇటీవల విశాఖలో ఎక్కువగా ఇలాంటి హనీట్రాప్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
ఏపీలో జరిగే సైబర్ మోసాల్లో బాధితులు ఎక్కువ మంది విశాఖ వాసులే. విశాఖపట్నం కేంద్రంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడటం, ఇతర దేశాల్లోని ముఠాలతో కలిసి ఇక్కడే కేంద్రాలు ఏర్పాటు చేయడం కలవర పెడుతోంది. నెల రోజుల వ్యవధిలో వెలుగులోకి వచ్చిన పలు మోసాల తీరు తెలిసి నగర వాసులు కలవరానికి గురవుతున్నారు.
హనీట్రాప్ కేసు ఆమెతో సరి : మురళీనగర్ కేంద్రంగా జాయ్ జెమీమా అనే యువతి హనీట్రాప్(ప్రేమ పేరుతో వలలో వేసుకోవడం)కు తెరలేపింది. ఆమె బాధితులు ఇటీవల ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఓ ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదుతో ఈ నెల 4న భీమిలి స్టేషన్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. 5న కోర్టుకు హాజరుపర్చి రిమాండ్‌కు పంపారు. 9వ తేదీన భీమునిపట్నం స్టేషన్‌కు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుని ఏసీపీ అప్పలరాజు విచారణ చేశారు.
ఈ నేపథ్యంలో బాధితులు ముందుకొచ్చి కంచరపాలెం, ఎయిర్‌పోర్ట్ స్టేషన్లలోనూ జమీమాపై కేసులు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఈమె బాధితులున్నారు. ఎలా వలలో వేసుకోవాలి? మత్తు ఎలా ప్రయోగించాలి? వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ ఎలా చేయాలి? అనే అంశంపై ఓ ముఠా శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇంకా ఆ ముఠాను అదుపులోకి తీసుకోలేదు.
ఓ ఫారెస్ట్ అధికారి హడావుడి : ఈ ముఠాలో ఓ ఫారెస్ట్ అధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. హనీట్రాప్ చేస్తున్న జెమీమా ఖాతా నుంచి ఆ అధికారి ఖాతాకు నగదు లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించి, సదరు అధికారిని పిలిపించి గోప్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. విచిత్రమేమంటే ఆమెను అరెస్టు చేసిన సమయంలో ఆ అధికారి పోలీసులకు ఫోన్ చేసి హడావుడి చేసినట్లు తెలుస్తోంది. 'జెమీమా నాకు బంధువు అవుతుంది. కేసు ఎలా పెడతారు? ఎలా అరెస్ట్ చేస్తారు?’ అంటూ పోలీసులనే హెచ్చరించడంతో అనుమానం వచ్చి ఆయన బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, ఫోన్ కాల్స్‌పై పోలీసులు దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతోంది.
నగరంలోనే ఉంటూ :
- సెప్టెంబర్ 28న దిల్లీలో నమోదైన కేసులో భాగంగా మురళీనగర్, ఎండాడలో ఉంటూ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న తొమ్మిది మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. నిరుద్యోగులే లక్ష్యంగా వీరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు.
- చైనా, తైవాన్‌లోని సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ విశాఖ కేంద్రంగా కాస్మోటిక్స్ అమ్మకాల పేరుతో బెట్టింగ్ యాప్‌లు, టాస్క్ గేమ్‌లు, ఫెడెక్స్ కొరియర్ నిర్వహిస్తున్న ఏడుగురితో కూడిన ముఠాను 17న అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ నిఘా విభాగం నుంచి విశాఖకు సమాచారం వచ్చింది. ఏఎన్‌బీచ్, విశాలాక్షినగర్ సమీపంలోని ప్లాట్లు అద్దెకు తీసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు ఖాతాలు సేకరించి సొమ్ము కాజేసి తైవాన్, చైనాకు నగదు బదిలీ చేస్తున్నట్లు గుర్తించారు.
- రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువతే లక్ష్యంగా నకిలీ ఐడీలతో బ్యాంకు ఖాతాలు తెరిచి వారి నుంచి డబ్బులు కాజేస్తున్న నలుగురు ముఠా సభ్యులను శుక్రవారం అరెస్ట్ చేశారు. 17 రాష్ట్రాల్లో 50 సైబర్ నేరాల ఫిర్యాదులు అందాయి. ఈ ముఠా రూ.40 కోట్ల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు - ఇప్పుడు వృద్ధులే టార్గెట్ - honey trap on old people
రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు - జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లే