Home Minister Vangalapudi Anitha Comments: డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన హోం మంత్రి అనిత, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని అన్నారు. పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని అన్నారు. పోలీసు అకాడమీ, గ్రేహౌండ్ అకాడమీ లేదని అన్నారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదని ఆరోపించారు. గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగిందని మంత్రి వెల్లడించారు. నేషనల్ క్రైం రికార్డులో మన రాష్ట్రాన్ని మూడో స్థానంలోకి తెచ్చారని విమర్శించారు.
వైఎస్సార్సీపీ పాలన అంత అధ్వానంగా ఉందని, నేటికీ విశాఖ జిల్లాలో ఒక పోలీస్టేషన్ రేకుల షెడ్లో నడుస్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుంచి ఏడాదికి 50 కోట్లు చొప్పున 250 కోట్లు పోలీసుశాఖకు రావాలని, ఈ ఐదేళ్లల్లో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని మంత్రి అనిత నిలదీశారు. ఇప్పుడు జీరో నుంచి తాము పని చేయాల్సిన పరిస్థితి అని అన్నారు. ఎస్కార్ట్ వాహనాలు కూడా పని చేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు.
మాదకద్రవ్యాల రహితంగా రాష్ట్రాన్ని మారుస్తాం : హోం మంత్రి అనిత - Home Minister In Anti Drug Day
పేపర్, పెన్ను ఖర్చులకు కూడా నిధులు ఇవ్వలేదు: 2014లో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారని, పేపర్, పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని అన్నారు. నేడు నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఎటువంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులు ఉన్నారని, వారు ఏవిధంగా పోలీసు విధులు చేయగలరని ప్రశ్నించారు. సీఐడీ విభాగంలో నార్కో టెక్ పరీక్షలు ఒక భాగమని, గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదన్నారు.
గతంలో సీఐడీ ఎలా పని చేసిందో అందరూ చూశామని, మంచి అలోచనతో పని చేస్తే విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని అన్నారు. అందరం కలిసికట్టుగా పని చేసి పోలీసులు పని తీరులో మార్పు తెస్తామన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని ఆరోపించారు. ప్రజలు ధైర్యంగా స్టేషన్‌కి వెళ్లి తమ బాధలు చెప్పుకునే భరోసా ఇవ్వాలన్నారు. స్టేషన్లో సిబ్బంది కూడా ప్రజలతో మర్యాదగా ఉండాలని అన్నారు. మన రాష్ట్రంలో ఆడపిల్లల అదృశ్యం అయిన ఘటనలు చాలా ఉన్నాయని, ఎవరైనా వస్తే వారిని కించపరిచేలా అధికారులు మాట్లాడవద్దని సూచించారు.
ఇక నుంచి రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్: పోలీసు అంటే ప్రతిపక్ష పార్టీలు అరెస్టులకే అనే విధంగా గత ప్రభుత్వం ఉపయోగించిందని, ఇక నుంచి రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, ప్రజలతో మంచిగా మాట్లాడాలని అన్నారు. సచివాలయ పోలీసులను ఏవిధంగా వినియోగించాలో ఆలోచన చేస్తామని అన్నారు. సోషల్ మీడియాలో నేటికీ తాను బాధితురాలినేనని తెలిపారు. అసభ్య పోస్టులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులు చాలా పెట్టారని, తన మీదే 23 కేసులు ఉన్నాయని, సీఎం దృష్టిలో పెట్టి అక్రమ కేసులపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పైన బాస్‌ను బట్టి కింద సిబ్బందిలో మార్పు ఉంటుందన్నారు. తాము పగ, ప్రతీకారాలు ఆలోచన చేయడం లేదని, పోలీసు అంటే ప్రజల్లో ఒక నమ్మకం, గౌరవం తీసుకొస్తామన్నారు.
రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది: దిశ చట్టమే ఏపీలో లేదని, ఇక స్టేషన్ల పేరు కూడా మార్చే ఆలోచన చేస్తామన్నారు. హోంశాఖలో ఎంత నిధులు అవసరమో ఒక నివేదిక సిద్ధం చేశామన్నారు. ప్రాధాన్యత ప్రకారం కేటాయిస్తూ ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. రిక్రూట్మెంట్ జరగాల్సి ఉందని, నిధుల కేటాయింపును బట్టి అన్నీ చేస్తామన్నారు. నిధుల కొరత వల్ల ఒకేసారి అన్నీ చేయలేమని, చాలా చోట్ల సీసీ కెమెరాలు, ప్రింగర్ ప్రింట్ స్కానర్లు పని చేయడం లేదని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీటిని అసలు పట్టించుకోలేదని అన్నారు.
రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్య కాదని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో నిబంధనలుకు విరుద్ధంగా పని చేసిన అధికారులపై చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. తమకు కక్ష సాధింపు అంటే, ఇంత కాలం ఆగుతామా అని ప్రశ్నించారు. తమ నాయకుడు చంద్రబాబు చెప్పిన ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు. విశాఖలో సీపీ కార్యాలయం తాకట్టులో ఉందని, ఎప్పుడు అప్పుల వాళ్లు వస్తారో తెలియదని అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో 164 సీట్లు ఇచ్చారని, తమకు రాష్ట్రం, ప్రజలే ముఖ్యమని, వారి కోసం పని చేస్తామన్నారు. పోలీసు అంటే ప్రజల కోసం పని చేసే వ్యవస్థ అనేలా పని చేయాలన్నారు. ఏపీలో ప్రతిఒక్కరూ భద్రతగా, భరోసాగా ఉండేలా చేస్తామని హోంమంత్రి అనిత అన్నారు.
ఫిర్యాదుల కోసం పబ్లిక్ ఏరియాల్లో కంప్లైంట్ బాక్సులు- హోంమంత్రి అనిత - Anitha About Complaint Boxes