High Tension Electricity Poles Crop Field in Kurnool District : విద్యుత్ ప్రాజెక్ట్ రాకతో తమకు ఉపాధి దొరకుతుందని ఆశగా ఎదురుచూసిన రైతుల నెత్తిన హైటెన్షన్ టవర్ల పిడుగుపడింది. ఎకరా, రెండెకరాలు సాగుచేసుకుంటున్న సన్నా, చిన్నకారు రైతుల జీవితాల్లో విద్యుత్ టవర్లు చిచ్చురేపుతున్నాయి. కోట్ల విలువ చేసే భూముల విలువ వేలకు పడిపోయింది. అటు విద్యుత్ సంస్థ సైతం పరిహారం చెల్లించకుండా రైతులకు రెండు వైపులా నష్టం చేకూరుస్తోంది.
Kurnool District : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, పాణ్యం మండలాల పరిధిలో గ్రీన్‌కో సంస్థ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా చెబుతున్న ఈ పరిశ్రమలో 5,410 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ విద్యుత్‌ను కోడుమూరు వరకు తీసుకెళ్లేందుకు భారీ టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ విద్యుత్ టవర్లను రైతుల పొలాల మీదుగా తీసుకెళ్లడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనీస సమాచారం లేకుండా ఇష్టానుసారం పొలాల్లో టవర్లు నిర్మాణం చేపట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు నష్టపరిహారం ఊసే ఎత్తడం లేదని రైతులు మండిపడుతున్నారు. గ్రీన్‌కో సంస్థ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టవర్ల ఏర్పాటుతో భూముల విలువ దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'కళ్ల ముందే పంట ఎండిపోతోంది- సాగునీరు ఇవ్వండి మహాప్రభో' - Farmers Facing Lack Of Irrigation
Greenco Project : గ్రీన్‌కో ప్రాజెక్టు నుంచి గ్రిడ్ వరకు విద్యుత్ టవర్లు ఏర్పాటు చేస్తే ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లోని కాల్వ, హుస్సేనాపురం, కొంతలపాడు, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ, కొల్లంపల్లి తాండా, ఎర్రకత్వ తదితర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు ప్రత్యక్షంగా నష్టపోనున్నారు. ఒకవేళ టవర్లు రాకపోయినా పొలం మీదుగా విద్యుత్ తీగలు వెళ్లినా ధరలు పడిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే గని, శకునాల సోలార్ పార్కు నుంచి ఓర్వకల్లు గ్రిడ్‌కు విద్యుత్‌ను అనుసంధానం చేశారు. దీని వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు. తాజాగా మరిన్ని టవర్లు ఏర్పాటు చేస్తే తమకు ఆత్మహత్యే శరణ్యమని రైతులు అంటున్నారు.
Construction of Electricity Towers : విద్యుత్ టవర్లు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే. కానీ కొందరు అక్రమార్కులు ఈ పరిహారం సొమ్ము దొంగపత్రాలతో తమ ఖాతాల్లోకి వేయించుకుంటున్నారు. సన్న, చిన్నకారు రైతులను పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు.