High Court Verdict on Setting Up Liquor Shops for Geetha Workers : నూతన మద్యం విధానంలో భాగంగా గీత కార్మికుల కోసం రిజర్వ్ చేసిన దుకాణాలను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో ముందుగా చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమంది. అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు గెజిట్ నోటిఫికేషన్ల ఆధారంగా చేపట్టబోయే తదుపరి చర్యలను నిలువరించేందుకు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 15కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం : గీత కార్మికులకు రిజర్వు చేసిన దుకాణాల ప్రాంతాలను వెల్లడించకుండా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొంటూ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కొడాలి గ్రామానికి చెందిన పరుచూరి శ్రీనివాసరావు, మరో వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2024-26 కాలానికి 3736 మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారని ఇందులో గీత కార్మికుల విభాగం కింద 340 షాపులు కేటాయించారన్నారు. వాటిని ఏ స్థానాల్లో ఏర్పాటు చేస్తారో అధికారులు వెల్లడించడం లేదన్నారు.
ముంబయి సినీ నటి కేసు - విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 1కి వాయిదా
ప్రభుత్వాన్ని ఆదేశించలేం : రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. గీత కార్మికులకు రిజర్వ్ చేసిన దుకాణాలను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. వాటికి ఎక్కడ అనుమతి ఇవ్వబోతున్నామనే విషయం ఇప్పుడే బయటకు వెల్లడిస్తే గీత కార్మికులకు నష్టం కలుగుతుందన్నారు. ఓపెన్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే వారు లబ్ధిపొందుతారన్నారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొత్త మద్యం పాలసీ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అన్నారు. ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోడానికి వీల్లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి గీత కార్మికుల కోసం రిజర్వు చేసిన దుకాణాలను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారో ముందే చెప్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తేల్చిచెప్పారు.
విచారణను నవంబర్ 15కి వాయిదా : రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల ఏర్పాటు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్, లైసెన్సుల జారీకి లాటరీ తీసేందుకు ప్రభుత్వం ఇచ్చిన మరో నోటిఫికేషన్‌ను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 25కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. గ్రామ జనాభా ఆధారంగా కాకుండా మండలం మొత్తాన్ని యూనిట్‌గా పరిగణించి ఆ మేరకు ‘రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్’ శ్లాబులను నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కె.వీర వెంకట సత్యనారాయణమూర్తి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి ప్రభుత్వ కౌంటర్ వేశాక అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తుది తీర్పును వెల్లడిస్తున్నామని స్పష్టం చేసింది.
'ఆ ప్లెక్సీలు తొలగించాల్సిన బాధ్యత అధికారులదే' - HC on Unauthorised Hoardings