High Court on YSRCP Leaders Anticipatory Bail Petition : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ముందస్తు బెయిలు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆ పార్టీ నేతలను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ప్రజాస్వామ్య దేశంలో ఓ పార్టీకి చెందిన వందల మంది కార్యకర్తలు మరో పార్టీ కార్యాలయంపై దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలో మీరే చెప్పాలని వ్యాఖ్యానించింది. ముందస్తు బెయిలు కోసం వైఎస్సార్సీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై వాదనల కొనసాగింపునకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
Mangalagiri TDP Office Attack Case : గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో ముందస్తు బెయిలు కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఆ పార్టీ కార్యకర్తలు జి రమేష్, షేక్ రబ్బాని బాషా, చిన్నాబత్తిన వినోద్ కుమార్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఎల్ రవిచందర్, పి వీరారెడ్డి, న్యాయవాది వై నాగిరెడ్డి వాదనలు వినిపించారు.
2021లో నమోదైన కేసులో మూడేళ్ల తర్వాత వందల సంఖ్యలో పలువురిని నిందితులుగా చేర్చి అరెస్టులు చేస్తున్నారని అన్నారు. నిందితుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారని, కొందరిని అరెస్టు చేసి, వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్లపై కేసు నమోదు చేశారని తెలిపారు. ఇదంతా రాజకీయ కక్షతో చేస్తున్నారని అన్నారు. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా పడింది.
దాదాపు రెండున్నరేళ్ల తర్వాత విచారణ వేగవంతం : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ కార్యాలయ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేసి వీరంగం సృట్టించారు. కార్లు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు అప్పట్లో ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా విచారణ చేశారు పోలీసులు. ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసులో వేగం పుంజుకుంది. దీంతో వైఎస్సార్సీపీ నేతలు భయాందోళనలో పడ్డారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - కీలక నిందితులుగా వైఎస్సార్సీపీ నేతలు - TDP Office Attack Case