High Court On YSRCP Leaders Anticipatory Bail Petition: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ కీలక పాత్ర పోషించారని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ కార్యాలయంపైకి ఉసిగొల్పారని, దాడి ఘటనను టీడీపీ కార్యాలయం సమీపం నుంచే పర్యవేక్షించారన్నారు. అందుకు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారాలున్నాయని, సాక్షులు వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఈ దశలో వారికి ముందస్తు బెయిలిస్తే దర్యాప్తునకు అవరోధం కలుగుతుందని, బెయిలు పిటిషన్లను కొట్టేయండని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పీపీ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టులో వాదనలు వినిపించారు.
దాడి ఘటన, పిటిషనర్ల పాత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచామన్నారు. పిటిషనర్లకు పూర్వ నేర చరిత్ర ఉందన్నారు. చట్టం అంటే వారికి లెక్కలేదన్నారు. పట్టపగలు టీడీపీ కార్యాలయంపై దాడికి తెగబడి విధ్వంసం సృష్టించారన్నారు. పలువుర్ని గాయపరిచారన్నారు. నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకొని కాల్ డేటాను సేకరించాల్సి ఉందన్నారు. ఎవరి ప్రోద్భలంతో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారనే విషయాన్ని తేల్చాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ కేసులో 117 మందిని నిందితులుగా చేర్చామన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన కేసులో దర్యాప్తును ఉద్దేశపూర్వంగా నీరుగార్చిన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశామన్నారు.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు పిటిషన్లను కొట్టేయాలని కోరారు. పోలీసుల తరఫు వాదనలు ముగియడంతో పిటిషనర్ల తరఫున కొందరు న్యాయవాదులు ప్రతి వాదనలు వినిపించడం కోసం విచారణ ఈనెల 21కి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకదాడి కేసులో ముందస్తు బెయిలు కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్, తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
విచారణ వేగవంతం : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19వ తేదీన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ కార్యాలయంలోని సిబ్బందిపై దాడి చేయడంతో పాటు అందులో ఉన్న ఫర్నిచర్‌ను సైతం ధ్వంసం చేసి వీరంగం సృట్టించారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా విచారణ చేశారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసులో వేగం పుంజుకుంది. దీంతో వైఎస్సార్సీపీ నేతలు భయాందోళనలో ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.