High Court Judgment to Resignation of Volunteers : ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో విలేజ్/వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయడం చర్చగా మారింది. తాజాగా ఏపీలో ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ బీసీవై అధ్యక్షుడు బి. రామచంద్రయాదవ్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిపింది. రాజీనామాలను అంగీకరిస్తే వైసీపీకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని వాదించిన పిటీషనర్ న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. వాలంటీర్ల రాజీనామాలను అంగీకరిస్తే ఓటర్లను నేరుగా ప్రభావితం చేస్తారన్నారన్న పిటీషనర్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎంతమంది విధుల్లో ఉన్నారో వివరాలు ఇవ్వాలంటూ ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం రేపటి(బుధవారం)కి వాయిదా వేసింది.
వాలంటీర్లపై వైసీపీ నేతల ఒత్తిడి - రాజీనామాలకు ప్రత్యేక కౌంటర్
వివరాల్లోకి వెళ్లే, ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో బోడే రామచంద్ర యాదవ్ ఇదివరకే పిటిషన్ దాఖలు చేశారు. భారత చైతన్య యువజన పార్టీ(BCY) పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బోడే రామచంద్ర యాదవ్ వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే వీరంతా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు పక్కదారి పడతాయని తన పిటిషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉండాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్టు హైకోర్టుకు పిటిషన్లో గుర్తుచేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో 44 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్టు తన పిటిషన్ ద్వారా హైకోర్టుకి సమాచారం చేరవేశారు. రామచంద్రయాదవ్ దాఖలు చేసిన ఈ పిటీషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ జరిపి తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
RESIGN: సచివాలయ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా
అయితే వాలంటీర్లు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం తీసుకుంటూ అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ప్రతిపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన కమిషన్, ఎలక్షన్ విధులతో పాటు ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొనవద్దంటూ వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాలంటీర్లుగా ఉంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వీలు ఉండదని వైసీపీ నేతలే వాలంటీర్లతో రాజీనామాలు చేయిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. విపక్ష నేతల వైఖరితో మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వారు వెల్లడిస్తున్నారు.
ఇప్పటికి రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రతిపక్ష కూటమి తమపై కక్ష కట్టడంతోనే రిజైన్ చేస్తున్నామంటూ వాలంటీర్లతో వైసీపీ నేతలు చెప్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 44 వేల మంది మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేయడం రాజకీయంగానూ రచ్చ లేపుతోంది. దీనిపై అధికార, ప్రతిపక్షాలు తప్పు మీదంటే, మీదంటూ మాటలు యుద్ధానికి దిగుతున్నాయి.