High Court Hearing on Raghurami Reddy Letter: విజిలెన్స్‌కు విస్తృత అధికారాలు కల్పించాలనే పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని ఏ కార్యాలయాల్లో అయినా ప్రవేశించి తనిఖీలు, జప్తులు, సమాచార సేకరణ, తదితర విషయాల్లో విస్తృతాధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అప్పటి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీ కొల్లి రఘురామిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 5న లేఖ రాశారు. ఆ లేఖను సవాలు చేస్తూ మంత్రి నారా లోకేశ్ మార్చి 13న వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేసిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి జులై 8కి వాయిదా వేశారు. న్యాయవాది అఖిల్‌చౌదరి వాదనలు వినిపించారు.
'వాలంటీర్ల రాజీనామా'- కౌంటర్ దాఖలుపై హైకోర్టు ఆదేశాలు - HC on Volunteers Resign Petition
రాష్ట్రంలోని ఏ కార్యాలయానికైనా వెళ్లి ఏకపక్షంగా తనిఖీలు, జప్తులు, వారెంట్ లేకుండా అరెస్టులు వంటి విషయాల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేస్తున్న గెజిటెడ్ అధికారులు అందరికీ అపరిమిత అధికారాలు కోరుతూ ప్రభుత్వానికి రఘురామిరెడ్డి రాసిన లేఖను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఆ లేఖను ఆధారం చేసుకుని ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలను నిలువరించాలని మంత్రి లోకేశ్ పిటిషన్‌లో కోరారు. ఎన్నికల్లో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసుల్లో ఇరికించాలన్న ఏకైక ఉద్దేశంతో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అక్రమ అధికారాన్ని కట్టబెట్టబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు అనుమతివ్వడం అనేది టీడీపీ నేతల హక్కులను హరించడమేనని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ప్రాసిక్యూషన్, జ్యుడీషియల్ అధికారాలను కల్పించాలని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కోరడం అనేది అసంబద్ధం అన్నారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణలు జరిపిన తర్వాత నివేదిక మాత్రమే ఇస్తుందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల విషయంలో ఈ విభాగానికి అపరిమిత అధికారాలు దాఖలు పరచడం అనేది చెల్లదని తెలిపారు. ప్రతివాదులందరూ విధులను దురుద్దేశపూర్వకంగా నిర్వర్తిస్తున్నారని ఈ అంశాలన్నింటిపై లేఖ ఆధారంగా ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలన్నింటినీ అడ్డుకోవాలి అని లోకేశ్ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. లోకేశ్ పిటిషన్‌పై ప్రస్తుతం విచారణ జరిపిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని చెబుతూ జులై 8కి హైకోర్టు వాయిదా వేసింది.
అపరిమిత అధికారాలతో చట్టం దుర్వినియోగం- రఘురామిరెడ్డి లేఖను సవాల్ చేస్తూ లోకేశ్ పిటిషన్