Heavy Rains in Warangal District Damages Paddy Grains : ఆరుగాలం కష్టం వరద పాలైంది. వడగండ్లు రైతులకు కడగండ్లను మిగిల్చాయి. భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని రేగొండ, ఘనపురం, చిట్యాల, మోగుళ్లపల్లి, టేకుమాట్ల మండలాల్లో వరి రైతుల ఆశలు ఆవిరయ్యాయి. మరో 15 రోజులైతే కోతలు పూర్తయ్యే సమయంలో చెడగొట్టు వానలతో, వరి నేలవాలింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, పంట చేతికి వచ్చే వేళ నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురంలో భారీ వర్షం అన్నదాతల్ని తీవ్రంగా దెబ్బతీసింది. రామప్ప సరస్సు శిఖంలోని వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట నేల వాలింది. వారం వరకు వరి పైరును కోసే అవకాశం లేదని, ఈలోగా వడ్లు మొలకెత్తుతున్నాయని వాపోతున్నారు.
"గతంలో వానాకాలంలో వానలకు నేలకు ఒరిగిన వరి, ఈసారి ఎండాకాలంలోనూ అకాల వర్షాలకు నేలమట్టం అయింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాం. సరిగ్గా చేతికందే సమయానికి ఇలా నీటిలో వాలింది. మా నష్టాలపై ప్రభుత్వం సత్వరమే స్పందించి ఆదుకోవాలని కోరుకుంటున్నాం."-రైతులు
Farmers Worried About Wet Paddy : వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్ యార్డులో వడ్లు వరద పాలయ్యాయి. పరకాల వ్యవసాయ మార్కెట్లోనూ ధాన్యం తడిసిపోయింది. వడ్లను కాపాడుకోవడానికి రైతులు టార్ఫాలిన్లు కప్పినా, లాభం లేకుండా పోయింది. 10 నుంచి 15 రోజులగా పడిగాపులు కాస్తున్నా, కొనుగోళ్లు జరగడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కురిసిన వర్షానికి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గార్ల శివారులో చెక్ డ్యాం మీద నుంచి పాకాల వాగు పొంగి ప్రవహించింది. రాంపురం, మద్దివంచ ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. గాంధీపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం చెరువును తలపించింది. వడ్లు తీసుకొచ్చి 20 రోజులు అవుతున్నా, కొనే నాథుడే లేడని కర్షకులు కన్నీళ్లు దిగమింగుకుంటూ వాపోయారు.
"ఎకరానికి రూ.15 వేలు చొప్పున కౌలు కట్టి, 20 ఎకరాల్లో నాటు వేశాను. ఎంతో వ్యయప్రయాసలు పడి, ఎండనక వాననక కష్టపడి పండించిన పంట, రేపోమాపో కోత కోస్తామనుకునే సమయంలో ఇలా గురువారం రాత్రి పడిన భారీ వర్షాలకు, పంటంతా నేలమట్టమైంది. దీనిపై ప్రభుత్వ స్పందించి ఆదుకోవాలి, వ్యవసాయ అధికారులు పంపి దీన్ని పరిశీలించి, పరిహారం ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాం."-కర్షకులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్, మల్హర్, పలిమెల, కాటారం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన, రైతుల్ని నిండా ముంచింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు సర్కార్‌ను వేడుకుంటున్నారు.