Uttarandhra Rains Today : భారీగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లి వెళ్లే గేదె గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో సుమారు 80 గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంచంగిపుట్టు మండలంలో ముంతగుమ్మి వంతెన కొట్టుకుపోవడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జీకే వీధి మండలం ఒడిశా వద్ద నిర్మాణంలో ఉన్న సరిహద్దు వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. నిర్మాణ సామగ్రి, రోడ్ రోలర్ కూడా నీటి పాలైంది. ఈ రహదారి చిత్రకొండ నుంచి భద్రాచలం వెళ్తుంది.
రంపచోడవరం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముసురుమిల్లి, భూపతిపాలెం జలాశయాలు నీటితో నిండాయి. దీంతో అధికారులు భూపతిపాలెం జలాశయం నుంచి మూడు గేట్లు ఎత్తి సీతపల్లి వాగులోకి నీటిని విడుదల చేశారు. పందిరి మామిడి వద్ద ఉన్న వంతెన పై నుంచి నీరు ప్రవహించడంతో మారేడుమిల్లి, వై రామవరం మండలాలకు చెందిన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జీకే వీధి మండలంలోని చట్రాపల్లి గ్రామస్తులకు పురావాస ఏర్పాట్లు చేస్తున్నామని ఐటీడీఏ పీఓ వి.అభిషేక్ స్పష్టం చేశారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు కల్వర్టులను ఆయన పరిశీలించారు. బాధితులకు సప్పర్ల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు తరలించి పునరావాసం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అందరికీ భోజన వసతి సదుపాయాలు కల్పించాలని చెప్పారు. మరోవైపు పాడేరు ఘాట్ మార్గం 12 మైళ్ల జంక్షన్ వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. అధికారులు స్థానికులు, వాహనదారుల సహకారంతో చెట్టును తొలగించారు.
ప్రమాదకర స్థాయిలో జోలాపుట్ జలాశయం నీటిమట్టం : జోలాపుట్ జలాశయంలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పచ్చని కొండల నడుమ ఎర్రటి బురద నీరు ఉగ్రరూపం దాల్చి పరుగులు తీస్తోంది. అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి ప్రవాహాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో జలాశయం వైపు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు వరద ప్రభావంతో జోలాపూట్ సరిహద్దు వద్ద గల ఐరన్ వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Uttarandhra Floods 2024 : పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం శివరాంపురం వద్ద వేగావతి పొంగి 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన ప్రజలు చుట్టూ తిరిగి 15 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా శివరాంపురం బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజవర్గంలోని తాండవ, వరాహ నదుల్లో వరద నీరు ఉగ్రరూపం దాల్చి ఉంది. వర్షాలు కారణంగా ఎస్.రాయవరం మండలం వద్ద ఇందేసమ్మ వాగు ఘాట్ రోడ్డు కోతకు గురైంది. దీంతో నదికి ఆనుకుని ఉన్న చాకలిపేట ఇంకా ముంపులోనే ఉంది. సత్యవరం వద్ద తాండవ నది వంతెన పై నుంచి ప్రవహించడంతో సమీప గ్రామాలకు రాకపోకలను నిలిచిపోయాయి. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వరద బాధితులను ఆదుకుంటామని తెలిపారు. వరదలు తగ్గుముఖం పట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు.
AP Rains 2024 Updates : శ్రీకాకుళం జిల్లాలో కవిటి మండలం సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే బెందాళం అశోక్ పర్యటించారు. అధికారులు జేసీబీ సాయంతో వరద నీటిని సముద్రంలోకి మళ్లించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నదాతలకు భరోసా ఇచ్చారు.
భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి - జలాశయాలకు పోటెత్తుతున్న వరద - HEAVY RAINS IN UTTARANDRA
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు- జలాశయాలకు పోటెత్తిన వరద - Heavy rains in Uttarandhra